రూ.680 కోట్లతో పుష్కరాల పనులు
నెలాఖరు కల్లా పూర్తికావాలి: సీఎస్ రాజీవ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల్లో సౌకర్యాల కల్పనకు రూ.680 కోట్లతో 668 పనులు మంజూరు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. మంజూరైన పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేయాలని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన ఇతర ఉన్నతాధికారులతో కలిసి పుష్కర పనులపై రెండు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రహదారులు, భవనాల శాఖకు సంబంధించి రూ. 366 కోట్లతో 63 పనులు చేపట్టగా వాటిలో 37, పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి రూ.134 కోట్లతో చేపట్టిన 131లో 42 పనులు పూర్తయినట్లు సీఎస్ చెప్పారు. రూ.137 కోట్లతో 81 పుష్కర ఘాట్లలో చేపట్టిన పనుల్లో 63 శాతం పూర్తయ్యాయన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా భక్తులకు అన్నదానం జరిగేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సూచించారు. సమాచార శాఖ క మిషనర్ నవీన్ మిట్టల్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సునీల్‌శర్మ, కార్యదర్శులు బి.వెంకటేశం, శివశంకర్, వికాస్‌రాజ్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.