‘కియా’ పనుల కోసం రూ.25 కోట్లతో ప్రణాళిక
– ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్నాయక్
అనంతపురం సిటీ : కియా కార్ల కంపెనీకి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హారేరామ్నాయక్ తెలిపారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కియా కంపెనీ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి నివేదికను పంపించామన్నారు. కియా కార్ల కంపెనీకి రోజుకు 2 లక్షల లీటర్ల నీరు అవసరమని చెప్పారు. నీటి అవసరాలు తీర్చేందుకు గొళ్లపల్లి నుంచి పైప్లైన్, 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచేందుకు సంపు, సరఫరాకు రెండు విద్యుత్ మోటార్లు అవసరం ఉందన్నారు. వీటిని ఏర్పాటు చేసి పైపులైన్ వేయడానికి రూ. 125 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్లకు పిలుస్తామన్నారు. తాత్కాలికంగా రూ. 3 కోట్లతో నీటిని అందిస్తామని చెప్పారు.
టెండర్లపై ఐదుగురికి శిక్షణ
ఆర్డబ్ల్యూఎస్లో టెండర్ల ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లాల వారిగా ఆ శాఖ నుంచి ఐదుగురికి అమరావతిలో 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్ఈ తెలిపారు. రెండు రోజుల్లో ఐదుగురిని అమరావతికి పంపుతామన్నారు.