భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
జగ్గయ్యపేట అర్బన్ : వరుస దాడులు జరుగుతున్నప్పటికీ గుట్కా అక్రమ వ్యాపారం జోరు తగ్గలేదు. గురువారం పట్టణంలో పట్టణ ఎస్ఐ–2 ఎస్.ప్రియకుమార్ జరిపిన దాడుల్లో రూ 3 లక్షలకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్లు, అనుమతి లేని బ్లాక్ అనే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఉదయం 8.30 సమయంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బలుసుపాడు రోడ్డులోని పాత వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆటోను తనిఖీ చేశారు. ఆటో డ్రైవరు సమాచారంతో పాత కూరగాయల మార్కెట్ సందులో ఉన్న గుండా కాశయ్యకు చెందిన గోడౌన్‌పై ఎస్ఐ తన సిబ్బంది, వీఆర్వోలు రాంబాబు, వీఆర్ఏ శివలతో కలిసి దాడి చేశారు. గోడౌన్లో ఉన్న సుమారు తొమ్మిది గుట్కా పార్సిళ్లను సీజ్ చేశారు. అనంతరం వాటిని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ సుమారు రూ 3 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. గుండా కాశయ్య, సాంబయ్యపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు కృష్ణయ్య, నాగరాజు పాల్గొన్నారు. సీఐ వైవిఎల్.లచ్చునాయుడు గుట్కాలు నిలువ ఉంచిన గోడౌన్‌ను పరిశీలించారు.