ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: భన్వర్ లాల్
రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసామని ఆయన మంగళవారమిక్కడ వెల్లడించారు. ఇప్పటికే 352 కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చాయని భన్వర్ లాల్ తెలిపారు. పోలీసులు తనిఖీలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.56 కోట్లు స్వాధీనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈవీఎంలు భద్రపరిచే భవనాన్ని భన్వర్లాల్ ప్రారంభించారు.
అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.