RTC employ
-
పట్టు వదలం
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే లక్ష్యంగా సమైక్యవాదులు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 58 రోజులుగా దృఢచిత్తంతో పోరాటం చేస్తున్నారు. మొదటి రోజు ఏ స్ఫూర్తితో ఉద్యమంలోకి దిగారో, అదే పోరాటపటిమతో పోరు కొనసాగిస్తున్నారు. గురువారం సమైక్యవాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రైవేటు బస్సులు కదల్లేదు. ఉద్యమంలో అసువులు బాసిన ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు చిత్రపటానికి నెల్లూరు ప్రధాన బస్టాం డ్లో ఘన నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీ రంలో మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం స్కూల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు భారీ ర్యాలీ చేసి, వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో మనుబోలులో ర్యాలీ జరిగింది. ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు మృతికి సంతాపంగా ఉదయగిరిలో బంద్ నిర్వహించారు. కలిగిరి మండలంలో గ్రామచైతన్య యాత్రలు నిర్వహించిన జేఏసీ నాయకులు సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గూడూరులో సోమశేఖరరాజు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. చెన్నై వెళుతూ గూడూరు రైల్వేస్టేషన్లో దిగిన సినీనటుడు నారాయణమూర్తికి సమైక్యసెగ తగిలింది. వాకాడులోని అశోక స్తంభం సెంట ర్లో సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించారు. కోవూరు, లేగుంటపాటు ఆత్మకూరులోని బస్టాండ్ సెంటర్లో రిలేదీక్షలు కొనసాగాయి. ఎల్లసిరి, పాశం ఘన నివాళులు గూడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన ఆర్టీసీ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సోమశేఖరరాజు మృతదేహాన్ని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సందర్శించి ఘన నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు నాశిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, షణ్ముగం నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆరని మంటలు
ఉద్యోగులు జీతాలను లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు.. విద్యార్థులు తరగతులకు దూరమవుతున్నారు... ఎప్పుడూ బయటకు రాని మహిళలు రోడ్డెక్కి నినదిస్తున్నారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సమైక్యరాష్ట్రం కోసం సకల జనులు శంఖారావం పూరిస్తున్నారు. ప్రొద్దుటూరులో బలిదానం చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి మునెయ్య చితిపై మంటలు ఆరినా... సమైక్య ప్రకటన వచ్చేవరకూ జిల్లా వ్యాప్తంగా మంటలు ఆరవని సమైక్యవాదులు ప్రతినబూనుతున్నారు. సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిల్లాలో 39రోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. ‘జై సమైక్యాంధ్ర అంటూ శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరులో నీటి ట్యాంక్‌పై నుంచి దూకి మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగమునెయ్య అంత్యక్రియలు శనివారం సమైక్యవాదుల సమక్షంలో జరిగాయి. అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులుతోపాటు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని నివాళులు అర్పించారు. జోహార్ మునెయ్య అంటూ నినాదాలు చేశారు. మునెయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రిలేదీక్షలకు కూర్చున్నారు. కడపలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో డీసీఎంస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోట నరసింహారావు, బీ కోడూరు మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి చేస్తున్న దీక్షలను భగ్నం చేశారు. ప్రైవేటు వృత్తివిద్యకోర్సుల కాలేజీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు శనివారం దీక్షలో కూర్చున్నారు. న్యాయవాదులు, వైవీయూ క్యాంపస్‌లో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా రాజంపేటలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు ఒంటికాలుపై నిరసన తెలిపి రోడ్డుపై మూడు గంటలపాటు బైఠాయించారు. లోక్‌సత్తా నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రదీప్ చేస్తున్న ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. పులివెందులలో స్వామివివేకానంద, వెంకటప్ప పాఠశాలల విద్యార్థులు ర్యాలీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూల అంగళ్లవద్ద మహిళలు మానవహారం నిర్వహించారు. మైదుకూరులో బ్రహ్మంగారిమఠానికి చెందిన 30మంది యువకులు రిలేదీక్షలకు కూర్చున్నారు. జమ్మలమడుగులో తొగట క్షత్రియులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. రైల్వేకోడూరులో రంగనాయకులపేట యూత్ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. -
విభజన వద్దని బలిదానం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఆర్టీసీ ఉద్యోగి గోపి మునెయ్య(53) జై సమైక్యాంధ్ర అంటూ అక్కడి నుంచి కిందికి దూకాడు. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో 1986లో మునెయ్య డ్రైవర్‌గా చేరాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వసుంధరకు ఇటీవలే వివాహం అయింది. పెద్దకుమారుడు మునిశేఖర్ ఎర్రగుంట్లలోని రాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, మరో కుమార్తె విజయలక్ష్మి డిగ్రీ, చిన్నకుమారుడు శివరాం 8వ తరగతి చదువుతున్నాడు. మునెయ్యకు ఇటీవల కంటి చూపు సరిగా లేకపోవడంతో డ్రైవర్‌గా కొనసాగలేనని ఉన్నతాధికారులకు విన్నవించాడు. దీంతో అధికారులు అతడిని గ్యారేజిలో శ్రామిక్‌గా నియమించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తోటి ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రతి రోజూ నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటీవలే అతను పులివేషం వేసుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎప్పటిలాగే తోటి ఉద్యోగస్తులతో కలిసి ఆర్టీసీ డిపో ఆవరణానికి చేరుకున్నాడు. ఉదయం నుంచి ఉద్యమంలో గడిపాడు. హైదరాబాద్‌లో శనివారం జరిగే బహిరంగసభ నిమిత్తం తరలి వెళ్లిన తోటి ఆర్టీసీ కార్మికులకు వీడ్కోలు కూడా పలికాడు. సాయంత్రం సమయంలో తోటి కార్మికులతో కలిసి మాట్లాడుతున్న మునెయ్య సమీపంలో ఉన్న నీళ్లట్యాంక్ ఎక్కాడు. దీనిని గమనించిన మరోకార్మికుడు ఎందుకు పైకి ఎక్కుతున్నావని ప్రశ్నించినప్పటికీ మునెయ్య పలకలేదు. కొద్ది సేపటికే జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మునెయ్య కిందికి దూకాడు. కింద ఉన్న చెట్టుపై పడగా కొమ్మకూడా విరిగింది. వెంటనే ఆర్టీసీ కార్మికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యులు వచ్చి చికిత్స మొదలుపెట్టిన అరగంటకే మునెయ్య మృతి చెందాడు. కొద్ది రోజుల నుంచి మునెయ్య జై సమైక్యాంధ్ర అని రాసిన రిబ్బన్‌ను తలకు చుట్టుకుని తిరుగుతున్నాడు. మృతి చెందిన సమయంలో కూడా రిబ్బన్ తలకు, మెడకు కట్టుకుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు, ఎమ్మెల్యే లింగారెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌ర్‌రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. బలిదానాలు వద్దు ఆవేశంతో ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. శాంతియుతంగానే పోరాటాలు చేస్తూ సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుందామన్నారు. ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్రేకాలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు.