ఉద్యోగులు జీతాలను లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు.. విద్యార్థులు తరగతులకు దూరమవుతున్నారు... ఎప్పుడూ బయటకు రాని మహిళలు రోడ్డెక్కి నినదిస్తున్నారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సమైక్యరాష్ట్రం కోసం సకల జనులు శంఖారావం పూరిస్తున్నారు. ప్రొద్దుటూరులో బలిదానం చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి మునెయ్య చితిపై మంటలు ఆరినా... సమైక్య ప్రకటన వచ్చేవరకూ జిల్లా వ్యాప్తంగా మంటలు ఆరవని సమైక్యవాదులు ప్రతినబూనుతున్నారు.
సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిల్లాలో 39రోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. ‘జై సమైక్యాంధ్ర అంటూ శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరులో నీటి ట్యాంక్‌పై నుంచి దూకి మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగమునెయ్య అంత్యక్రియలు శనివారం సమైక్యవాదుల సమక్షంలో జరిగాయి. అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులుతోపాటు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని నివాళులు అర్పించారు.
జోహార్ మునెయ్య అంటూ నినాదాలు చేశారు. మునెయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ప్రొద్దుటూరు సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రిలేదీక్షలకు కూర్చున్నారు. కడపలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో డీసీఎంస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోట నరసింహారావు, బీ కోడూరు మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి చేస్తున్న దీక్షలను భగ్నం చేశారు. ప్రైవేటు వృత్తివిద్యకోర్సుల కాలేజీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు శనివారం దీక్షలో కూర్చున్నారు. న్యాయవాదులు, వైవీయూ క్యాంపస్‌లో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు.
హైదరాబాద్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా రాజంపేటలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు ఒంటికాలుపై నిరసన తెలిపి రోడ్డుపై మూడు గంటలపాటు బైఠాయించారు. లోక్‌సత్తా నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రదీప్ చేస్తున్న ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. పులివెందులలో స్వామివివేకానంద, వెంకటప్ప పాఠశాలల విద్యార్థులు ర్యాలీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూల అంగళ్లవద్ద మహిళలు మానవహారం నిర్వహించారు. మైదుకూరులో బ్రహ్మంగారిమఠానికి చెందిన 30మంది యువకులు రిలేదీక్షలకు కూర్చున్నారు. జమ్మలమడుగులో తొగట క్షత్రియులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. రైల్వేకోడూరులో రంగనాయకులపేట యూత్ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు.
ఆరని మంటలు
Published Sun, Sep 8 2013 4:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement