ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఆర్టీసీ ఉద్యోగి గోపి మునెయ్య(53) జై సమైక్యాంధ్ర అంటూ అక్కడి నుంచి కిందికి దూకాడు. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో 1986లో మునెయ్య డ్రైవర్‌గా చేరాడు.
అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వసుంధరకు ఇటీవలే వివాహం అయింది. పెద్దకుమారుడు మునిశేఖర్ ఎర్రగుంట్లలోని రాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, మరో కుమార్తె విజయలక్ష్మి డిగ్రీ, చిన్నకుమారుడు శివరాం 8వ తరగతి చదువుతున్నాడు. మునెయ్యకు ఇటీవల కంటి చూపు సరిగా లేకపోవడంతో డ్రైవర్‌గా కొనసాగలేనని ఉన్నతాధికారులకు విన్నవించాడు.
దీంతో అధికారులు అతడిని గ్యారేజిలో శ్రామిక్‌గా నియమించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తోటి ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రతి రోజూ నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటీవలే అతను పులివేషం వేసుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎప్పటిలాగే తోటి ఉద్యోగస్తులతో కలిసి ఆర్టీసీ డిపో ఆవరణానికి చేరుకున్నాడు. ఉదయం నుంచి ఉద్యమంలో గడిపాడు.
హైదరాబాద్‌లో శనివారం జరిగే బహిరంగసభ నిమిత్తం తరలి వెళ్లిన తోటి ఆర్టీసీ కార్మికులకు వీడ్కోలు కూడా పలికాడు. సాయంత్రం సమయంలో తోటి కార్మికులతో కలిసి మాట్లాడుతున్న మునెయ్య సమీపంలో ఉన్న నీళ్లట్యాంక్ ఎక్కాడు. దీనిని గమనించిన మరోకార్మికుడు ఎందుకు పైకి ఎక్కుతున్నావని ప్రశ్నించినప్పటికీ మునెయ్య పలకలేదు. కొద్ది సేపటికే జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మునెయ్య కిందికి దూకాడు. కింద ఉన్న చెట్టుపై పడగా కొమ్మకూడా విరిగింది. వెంటనే ఆర్టీసీ కార్మికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
వైద్యులు వచ్చి చికిత్స మొదలుపెట్టిన అరగంటకే మునెయ్య మృతి చెందాడు. కొద్ది రోజుల నుంచి మునెయ్య జై సమైక్యాంధ్ర అని రాసిన రిబ్బన్‌ను తలకు చుట్టుకుని తిరుగుతున్నాడు. మృతి చెందిన సమయంలో కూడా రిబ్బన్ తలకు, మెడకు కట్టుకుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు, ఎమ్మెల్యే లింగారెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌ర్‌రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు.
బలిదానాలు వద్దు
ఆవేశంతో ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. శాంతియుతంగానే పోరాటాలు చేస్తూ సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుందామన్నారు. ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్రేకాలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు.
విభజన వద్దని బలిదానం
Published Sat, Sep 7 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement