లక్ష్యం దిశగా..
ఓ వైపు ప్రజల అవసరాలను గుర్తిస్తూ...వారికి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూనే.. మరో వైపు సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును సాగిస్తున్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. దసరా నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
అయినా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ బాటను మాత్రం వీడలేదు. లక్ష్యం కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రధానంగా ఎన్జీఓలు తమ పోరును విరమించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు.
సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు శనివారం దీక్ష విరమించారు. ఆర్టీసీ ఆర్ఎం గోపీనాథరెడ్డి దీక్షకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. జిల్లాలో అత్యంత వైభంగా జరిగే దసరా వేడుకల నేపథ్యంలో ప్రజలకు ఆటంకం కలగకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 73రోజుల తర్వాత శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పాయి. ఇన్ని రోజలుగా అధికచార్జీలు చెల్లించి ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు బస్సులను ఆశ్రయించిన ప్రయాణికులు బస్సులు తిరగడంతో ఆనందంగా ఉన్నారు.
కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు, నగరపాలక సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ సిబ్బంది రిలే దీక్షలు నడుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఎన్జీవోలు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ ఆధ్వర్యంలో 10మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఉద్యమకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు 6లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఉదయం 10-12గంటల వరకూ వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా, చంద్రబాబుదీక్ష భగ్నానికి నిరసనగా సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజంపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులు దీక్షలు చేశారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు, జేఏసీ చైర్మన్ రమణ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో తులసీ స్కూలు విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. మైదుకూరులో నందికాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆపై మానవహారం చేసి రిలేదీక్షలకు కూర్చున్నారు. బద్వేలులో మాలమహానాడు నేత ఎస్రోమ్ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు.