RTC rental Bus
-
ఆర్టీసీ అద్దె బస్సులో వైద్యురాలికి వేధింపులు
డ్రైవర్‌కు దేహశుద్ధి హిందూపురం అర్బన్ : అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆర్టీసీ అద్దె బస్సులో గుంటూరుకు బయల్దేరిన వైద్యురాలిపై అదనపు డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు మార్గ మధ్యంలోనే బస్సు దిగిపోయి.. జరిగిన విషయాన్ని ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సదరు డ్రైవర్‌ను తిరిగి హిందూపురం వచ్చాక చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి బాధితురాలు పుట్టినిల్లు హిందూపురం నుంచి ఏపీ07 టీజీ 8106 నంబరు గల ఆర్టీసీ సూపర్ లగ్జరీ అద్దెబస్సులో మెట్టినిల్లు గుంటూరుకు బయల్దేరారు. 19వ నంబరు సీటులో కూర్చున్నారు. అనంతపురం వెళ్లాక బస్సులో కొన్ని బ్యాగులు, లగేజీ వేశారు. కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు తనిఖీలు చేసి.. బస్సులోంచి నాలుగు బ్యాగుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం గంట ఆలస్యంగా బస్సు బయల్దేరింది. దీంతో చాలామంది ప్రయాణికులు మార్కాపురం చేరుకున్నాక ఇతర బస్సుల్లో వెళ్లారు. 15 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా సగం మంది కుంట, వినుకొండలో దిగిపోయారు. ఇక బస్సులో ఐదారుగురే మిగిలారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్న కొద్దీ అదనపు డ్రైవర్‌గా ఉన్న చంద్రమోహన్‌రెడ్డి వైద్యురాలి వద్దకు వెళ్లి తాకడానికి ప్రయత్నిస్తూ.. రకరకాల ప్రశ్నలతో వేధించాడు. అతని వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం బస్టాండ్‌లో దిగి, అక్కడినుంచి మరోబస్సులో గుంటూరుకు చేరుకున్నారు. తర్వాత హిందూపురంలోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం హిందూపురానికి బస్సు రాగానే.. సదరు డ్రైవర్‌ను పట్టుకుని దేహాశుద్ధి చేశారు. డీఎం గోపీనాథ్ బస్సు యజమానిని పిలిపించి మాట్లాడారు. డ్రైవర్ వ్యవహారశైలిపై విచారణ చేశారు. అతనిపై కేసు నమోదు చేయిస్తామన్నారు. -
టిమ్ బాధ్యతలు ఇస్తే అడ్డుకుంటాం
నెల్లూరు (టౌన్) : ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లకు కండక్టర్లు బాధ్యతలు అప్పజెప్పితే నేషనల్ మజ్దూర్ యూనియన్ అడ్డుకుంటుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణరాజు తెలిపారు. అద్దె బస్సులో టిమ్ డ్యూటీ అప్పజెప్పడంపై మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో టీ విరామ సమయంలో బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ అద్దె బస్సులను కండక్టర్లతోనే నడపాలని డిమాండ్ చేశారు. -
బస్సు ‘అద్దె’లు మళ్లీ మేశారు
♦ అడ్డదారిలో అదనంగా అద్దెల చెల్లింపు ♦ మూడు డిపోల పరిధిలో గుర్తించిన ఆడిట్ విభాగం ♦ రహస్యంగా విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల పేర జరుగుతున్న అక్రమాలకు తెరపడేట్టు కనిపిం చటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తూ కమీషన్లు దండుకునేందుకు అలవాటుపడ్డ సిబ్బం ది తమ తీరు మార్చుకోవట్లేదు. కొన్ని నెలల క్రితం వరంగల్ జిల్లా తొర్రూరు డిపో పరిధిలో అక్రమంగా రూ.10.86 లక్షల మేర అదనపు అద్దెలు చెల్లించిన ఉదంతంలో బాధ్యులను సస్పెండ్ చేసినా.. మళ్లీ అదే తరహాలో మరికొన్ని అక్రమాలు వెలుగుచూశాయి. తాజాగా ఆడిట్ సిబ్బంది వాటిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు డిపోల పరిధిలో ఈ బాగోతం వెలుగుచూసినట్టు సమాచారం. విజిలెన్సు అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అక్రమాలు ఇలా... కొంతకాలంగా ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. కొత్త బస్సులు కొనే స్తోమత లేకపోవటంతో పెరుగుతున్న డిమాండును తట్టుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టెండర్ల ద్వారా అద్దె బస్సులు సమకూర్చుకుంటోంది. ఇలా దాదాపు 1800 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. వీటికి 15 రోజులకోమారు బిల్లులు చెల్లిస్తారు. కండీషన్లో ఉన్న బస్సులనే అద్దెకు తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ వరసగా ఐదేళ్లపాటు తిరిగిన బస్సును ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి వస్తే దాన్ని బాడీ సహా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుంది. అప్పటి వరకు చెల్లిస్తున్న అద్దెను కూడా ఆ బస్సులకు తగ్గించి చెల్లిస్తారు. ఆ బస్సుకు ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే కిలోమీటరుకు 99 పైసలు చొప్పున తగ్గించి అద్దె చెల్లించాలి. ఈ నిబంధనను ఆసరా చేసుకుని వాటి నిర్వాహకులతో కుమ్మక్కవుతున్న అధికారులు వాటి కి కొత్త బస్సులకు చెల్లించే అద్దె చెల్లిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మూడు డిపోల పరిధిలో రూ.లక్షల్లో అక్రమాలు జరిగినట్టు తేలింది. అద్దె బస్సు తిరిగిన కిలోమీటర్లు ఎంతో డిపో ట్రాఫిక్ విభాగం లెక్కగట్టి పర్సనల్ డిపార్ట్మెంటుకు పంపుతుంది. దాన్ని ఆ బస్సు అగ్రిమెంట్ కాపీతో సరిచూసుకుని ఈ విభాగం ఆర్ఎం కార్యాలయానికి పంపుతుంది. అక్కడి ఆడిట్ విభాగం మరోసారి పరిశీలించి ఆ బస్సుకు ఇవ్వాల్సిన బిల్లు ఎంతో తేలుస్తుంది. ఆ తర్వాతే అకౌంట్స్ విభాగం బిల్లు సిద్ధం చేస్తుంది. ఇన్ని తనిఖీ వ్యవస్థలను దాటుకుని కూడా అక్రమంగా చెల్లింపులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్సు విభాగం నివేదిక ఇచ్చాక ఆర్టీసీ జేఎండీ రమణారావు బాధ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
బస్సు మిగేసింది...
మరో ఐదు నిమిషాలు గడిచి ఉంటే వారు క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. కానీ ఇంతలోనే ఆర్టీసీ అద్దెబస్సు రూపంలో మృత్యువు వారిపైకి దూసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ⇒ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు ⇒ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి సిద్దవటం: మండలంలోని కడప-రేణిగుంట స్టేట్ హైవే పరిధిలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దవటం మండలం పెద్దపల్లె గ్రామ పంచాయతీ మలినేనిపట్నం కాలనీకి చెందిన ఓబిలి బాలసిద్ధయ్య(26), అతని అన్న కుమార్తె సిద్ధు లహరి(4), తల్లి హుసేనమ్మ(55) ఆదివారం రామాపురం మండలం దూదేకులపల్లె గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి సోమవారం ఉదయం దూదేకులపల్లె నుంచి స్వగ్రామానికి బయలు దేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన సమయంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న బద్వేలు డిపోకు చెందిన ఏపీ04ఎక్స్6041నెంబర్ గల అద్దె బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బాలసిద్ధయ్య, సిద్ధు లహరిలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన హుసేనమ్మను కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల్లో సౌదికి వెళ్లేవాడివయ్యా... మూడు రోజుల్లో సౌదీకి వెళ్లాల్సినోడివయ్యా.. అంతలోనే దేవుడు నిన్ను తీసుకెళ్లాడు కదయ్యా.. ఇక నాకు దిక్కు ఎవరయ్యా.. అంటూ మృతుడు బాలసిద్ధయ్య భార్య సుభాన్‌బీ విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. బాలసిద్ధయ్యకు మంటపంపల్లెకు చెందిన సుభాన్బీతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం మృతుడు బేల్దారి పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సౌదీలో ఉన్న అతని అన్న సలీం ఇటీవలే వీసా పంపించాడు. మరో మూడు రోజుల్లో సౌదీకి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో మృతుని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒంటిమిట్ట సీఐ ఉలసయ్య, ఎస్ఐ పెద్దఓబన్నలు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.