బస్సు ‘అద్దె’లు మళ్లీ మేశారు
♦ అడ్డదారిలో అదనంగా అద్దెల చెల్లింపు
♦ మూడు డిపోల పరిధిలో గుర్తించిన ఆడిట్ విభాగం
♦ రహస్యంగా విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల పేర జరుగుతున్న అక్రమాలకు తెరపడేట్టు కనిపిం చటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తూ కమీషన్లు దండుకునేందుకు అలవాటుపడ్డ సిబ్బం ది తమ తీరు మార్చుకోవట్లేదు. కొన్ని నెలల క్రితం వరంగల్ జిల్లా తొర్రూరు డిపో పరిధిలో అక్రమంగా రూ.10.86 లక్షల మేర అదనపు అద్దెలు చెల్లించిన ఉదంతంలో బాధ్యులను సస్పెండ్ చేసినా.. మళ్లీ అదే తరహాలో మరికొన్ని అక్రమాలు వెలుగుచూశాయి. తాజాగా ఆడిట్ సిబ్బంది వాటిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు డిపోల పరిధిలో ఈ బాగోతం వెలుగుచూసినట్టు సమాచారం. విజిలెన్సు అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
అక్రమాలు ఇలా...
కొంతకాలంగా ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. కొత్త బస్సులు కొనే స్తోమత లేకపోవటంతో పెరుగుతున్న డిమాండును తట్టుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టెండర్ల ద్వారా అద్దె బస్సులు సమకూర్చుకుంటోంది. ఇలా దాదాపు 1800 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. వీటికి 15 రోజులకోమారు బిల్లులు చెల్లిస్తారు. కండీషన్‌లో ఉన్న బస్సులనే అద్దెకు తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ వరసగా ఐదేళ్లపాటు తిరిగిన బస్సును ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి వస్తే దాన్ని బాడీ సహా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుంది. అప్పటి వరకు చెల్లిస్తున్న అద్దెను కూడా ఆ బస్సులకు తగ్గించి చెల్లిస్తారు.
ఆ బస్సుకు ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే కిలోమీటరుకు 99 పైసలు చొప్పున తగ్గించి అద్దె చెల్లించాలి. ఈ నిబంధనను ఆసరా చేసుకుని వాటి నిర్వాహకులతో కుమ్మక్కవుతున్న అధికారులు వాటి కి కొత్త బస్సులకు చెల్లించే అద్దె చెల్లిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మూడు డిపోల పరిధిలో రూ.లక్షల్లో అక్రమాలు జరిగినట్టు తేలింది. అద్దె బస్సు తిరిగిన కిలోమీటర్లు ఎంతో డిపో ట్రాఫిక్ విభాగం లెక్కగట్టి పర్సనల్ డిపార్ట్‌మెంటుకు పంపుతుంది. దాన్ని ఆ బస్సు అగ్రిమెంట్ కాపీతో సరిచూసుకుని ఈ విభాగం ఆర్‌ఎం కార్యాలయానికి పంపుతుంది. అక్కడి ఆడిట్ విభాగం మరోసారి పరిశీలించి ఆ బస్సుకు ఇవ్వాల్సిన బిల్లు ఎంతో తేలుస్తుంది. ఆ తర్వాతే అకౌంట్స్ విభాగం బిల్లు సిద్ధం చేస్తుంది. ఇన్ని తనిఖీ వ్యవస్థలను దాటుకుని కూడా అక్రమంగా చెల్లింపులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్సు విభాగం నివేదిక ఇచ్చాక ఆర్టీసీ జేఎండీ రమణారావు బాధ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.