బస్సు మిగేసింది...
మరో ఐదు నిమిషాలు గడిచి ఉంటే వారు క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. కానీ ఇంతలోనే ఆర్టీసీ అద్దెబస్సు రూపంలో మృత్యువు వారిపైకి దూసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
⇒ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
⇒ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సిద్దవటం: మండలంలోని కడప-రేణిగుంట స్టేట్ హైవే పరిధిలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దవటం మండలం పెద్దపల్లె గ్రామ పంచాయతీ మలినేనిపట్నం కాలనీకి చెందిన ఓబిలి బాలసిద్ధయ్య(26), అతని అన్న కుమార్తె సిద్ధు లహరి(4), తల్లి హుసేనమ్మ(55) ఆదివారం రామాపురం మండలం దూదేకులపల్లె గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు.
అక్కడ పనులు ముగించుకుని తిరిగి సోమవారం ఉదయం దూదేకులపల్లె నుంచి స్వగ్రామానికి బయలు దేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన సమయంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న బద్వేలు డిపోకు చెందిన ఏపీ04ఎక్స్6041నెంబర్ గల అద్దె బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బాలసిద్ధయ్య, సిద్ధు లహరిలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన హుసేనమ్మను కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
మూడు రోజుల్లో సౌదికి వెళ్లేవాడివయ్యా...
మూడు రోజుల్లో సౌదీకి వెళ్లాల్సినోడివయ్యా.. అంతలోనే దేవుడు నిన్ను తీసుకెళ్లాడు కదయ్యా.. ఇక నాకు దిక్కు ఎవరయ్యా.. అంటూ మృతుడు బాలసిద్ధయ్య భార్య సుభాన్‌బీ విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. బాలసిద్ధయ్యకు మంటపంపల్లెకు చెందిన సుభాన్‌బీతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం మృతుడు బేల్దారి పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
సౌదీలో ఉన్న అతని అన్న సలీం ఇటీవలే వీసా పంపించాడు. మరో మూడు రోజుల్లో సౌదీకి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో మృతుని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒంటిమిట్ట సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ పెద్దఓబన్నలు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.