- డ్రైవర్‌కు దేహశుద్ధి
హిందూపురం అర్బన్ : అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆర్టీసీ అద్దె బస్సులో గుంటూరుకు బయల్దేరిన వైద్యురాలిపై అదనపు డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు మార్గ మధ్యంలోనే బస్సు దిగిపోయి.. జరిగిన విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సదరు డ్రైవర్‌ను తిరిగి హిందూపురం వచ్చాక చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి బాధితురాలు పుట్టినిల్లు హిందూపురం నుంచి ఏపీ07 టీజీ 8106 నంబరు గల ఆర్టీసీ సూపర్ లగ్జరీ అద్దెబస్సులో మెట్టినిల్లు గుంటూరుకు బయల్దేరారు. 19వ నంబరు సీటులో కూర్చున్నారు. అనంతపురం వెళ్లాక బస్సులో కొన్ని బ్యాగులు, లగేజీ వేశారు. కొద్ది దూరం వెళ్లగానే పోలీసులు తనిఖీలు చేసి.. బస్సులోంచి నాలుగు బ్యాగుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం గంట ఆలస్యంగా బస్సు బయల్దేరింది. దీంతో చాలామంది ప్రయాణికులు మార్కాపురం చేరుకున్నాక ఇతర బస్సుల్లో వెళ్లారు. 15 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా సగం మంది కుంట, వినుకొండలో దిగిపోయారు. ఇక బస్సులో ఐదారుగురే మిగిలారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్న కొద్దీ అదనపు డ్రైవర్‌గా ఉన్న చంద్రమోహన్‌రెడ్డి వైద్యురాలి వద్దకు వెళ్లి తాకడానికి ప్రయత్నిస్తూ.. రకరకాల ప్రశ్నలతో వేధించాడు. అతని వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం బస్టాండ్‌లో దిగి, అక్కడినుంచి మరోబస్సులో గుంటూరుకు చేరుకున్నారు. తర్వాత హిందూపురంలోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం హిందూపురానికి బస్సు రాగానే.. సదరు డ్రైవర్‌ను పట్టుకుని దేహాశుద్ధి చేశారు. డీఎం గోపీనాథ్ బస్సు యజమానిని పిలిపించి మాట్లాడారు. డ్రైవర్ వ్యవహారశైలిపై విచారణ చేశారు. అతనిపై కేసు నమోదు చేయిస్తామన్నారు.