సాక్షి, చండీగఢ్ : ఒకవైపు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరోవైపు కరోనా కట్టడిలో అనేకమంది వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. అయితే వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొంతమంది డాక్టర్లు ప్రవర్తిస్తున్నారు. హర్యానాలోని సివిల్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు. ఈ కేసు విచారణలో ఆసుపత్రి వైఖరిపై మండిపడిన నర్సులు డాక్టరుపై దాడి చేసిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది.
పంచకుల సెక్టార్ 6 లోని సివిల్ హాస్పిటల్‌లో కోవిడ్-19 డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు వేధింపులకు తెగబడ్డాడు. దీనిపై నర్సుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడి పట్ల కఠినంగా వ్యహరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సులు మనోజ్‌కుమార్‌పై దాడి చేసి చితక్కొట్టారు. మంగళవారం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కేసు పూర్వాపరాలు
నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ సమాచారం ప్రకారం కోవిడ్-19 ఐసోలేషన్ విధుల్లో ఉండగా శనివారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మద్యం సేవించి ఉన్న కుమార్ వార్డుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు. ఆమె గది లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు వేసి, ఆమెపై దాడి చేశాడు. మాస్క్‌ను తొలగించి లైంగికంగా వేధించాడు. దీన్ని ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. అయితే ఎలాగోలా తప్పించుకున్న ఆమె తన సహచరులకు, నర్సింగ్ ఇన్‌ఛార్జిలతోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ), ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ (పీఎంఓ)లకు ఫిర్యాదు చేశారు.
అయితే, ఆసుపత్రి యాజమాన్యం నిందితుడిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కౌర్ ఆరోపించారు. అధికారుల చర్యల కోసం తాము రెండు రోజులు వేచి ఉన్నామని తెలిపారు. ఆసుపత్రి సీనియర్ అధికారులు చాలా మంది మహిళలే ఉన్నారు కాబట్టి తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని కౌర్ వాపోయారు. పైగా బాధితురాలిని మూడు రోజుల సెలవుపై పంపారన్నారు. సోమవారం మధ్యాహ్నం కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళితే, మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లమంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాని ఆరోపించారు. దీంతో తాము మహిళా కమిషన్‌ను ఆశ్రయించా మన్నారు. నిందితుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, విధులను యధావిధిగా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వైద్యుడిపై (మహిళల పోలీస్ స్టేషన్‌లో) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామనీ, కేసును దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నూపూర్ బిష్ణోయ్ చెప్పారు. వైద్యుడిని అదుపులోకి తీసుకోలేదనీ, అతని స్టేట్‌మెంట్ ఇంకా నమోదు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ విషయంపై పంచకుల సీఎంఓ డాక్టర్ జస్జీత్ కౌర్ మాట్లాడుతూ అంతర్గత కమిటీ నివేదికను డైరెక్టర్ జనరల్, హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) తో పాటు, మహిళా కమిషన్‌కు కూడా పంపినట్లు తెలిపారు. వైద్యుడిని డిప్యుటేషన్‌పై పంపించామనీ, పోలీసుల విచారణ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. అలాగే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, డాక్టరుపై దాడి చేసిన వారిపై కూడా విచారణ జరుగుతుందని డిజిహెచ్ఎస్ డా. కాంభోజీ ప్రకటించడం గమనార్హం.
మహిళా కమిషన్ అసంతృప్తి: మరోవైపు ఆసుపత్రి యాజమాన్య దర్యాప్తుపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుపై ఆసుపత్రి అధికారులు సమర్పించిన నివేదికపై ప్యానెల్ సంతృప్తి చెందలేదని మహిళా కమిషన్ వైస్ చైర్మన్ ప్రీతి భరద్వాజ్ ప్రకటించారు.
Panchkula: A staff nurse was allegedly eve teased by a doctor at civil hospital Sector-6 Panchkula. Nurses protested against the doctor and also thrashed him in his office. pic.twitter.com/bpX98nTn7P
— PRITAM THAKUR (@pritamt2707) July 14, 2020
Comments
Please login to add a commentAdd a comment