'అప్పుడే అబద్ధం ఆడి ఉంటే...'
కడప కార్పొరేషన్: గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్క అబద్ధం ఆడి ఉంటే 175 సీట్లు తమకు వచ్చి ఉండేవని ఆ పార్టీ ఎమ్మెల్యే, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉండడం వల్లే వైఎస్ జగన్ నేడు ప్రతి పక్షంలో ఉన్నట్టు చెప్పారు. మంగళవారం కడపలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ తరఫున టేబుల్ ఫ్యాన్ గుర్తుతో ఉన్న పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు టేబుల్ ఫ్యాన్ గుర్తు వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.