ఆర్టీసీ ఎండీ ఒంగోలు వాసే
ఒంగోలు: ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన నండూరి సాంబశివరావు స్వస్థలం ఒంగోలులోని మిరియాలపాలెం. తండ్రి రామకోటయ్య మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవారు. తల్లి సూరమ్మ గృహిణి. కష్టపడి చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిష్టించడం పట్ల ఒంగోలు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యనంతా పీవీఆర్ పాఠశాలలో 1967-1972 కాలంలో పూర్తిచేశారు.
స్థానిక సీఎస్ఆర్ శర్మా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్-మెరైన్ ఇంజినీరింగ్‌ను 1974-79 లో పూర్తిచేశారు. ఇక్కడ కూడా టాపర్ అండ్ లాజరస్ ప్రైజ్ విజేతగా నిలిచారు. అనంతరం మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (మెకానికల్ ఇంజనీరింగ్)ను ఐఐటీ కాన్పూర్‌లో 1979-81 కాలంలో అభ్యసించారు. సివిల్స్‌లో రాణించి 1984లో ఐపీఎస్ హోదాలో ఆయన పోలీసు డిపార్టుమెంట్లో చేరారు.
మార్చి 2010 నుంచి 2013 మే వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ డెరైక్టర్ పని చేశారు. 2013 మే నుంచి ఆయన అత్యవసర సేవల విభాగమైన ఫైర్ అండ్ ఎమర్జన్సీ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనను తాజాగా ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన సతీమణి కూడా ఒంగోలు శర్మా కాలేజీలోనే చదువుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా వాసి కాగా, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ సాంబశివరావు కూడా ఒంగోలు వాసే కావడం గమనార్హం.