సీఎం ఆస్తుల వివరాలు వెల్లడించలేం
చండీగఢ్: సమాచార హక్కు చట్టం కింద ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుందని పేర్కొంది. గతంలో భూపేందర్ హుడా ప్రభుత్వం ఈ వివరాలు ఇచ్చినా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు కార్యకర్త పీపీ కపూర్ మార్చిలో సమాచార కమిషన్ ను కోరారు. దీంతో సంబంధిత అధికారులకు సమాచార కమిషన్ నోటీసు జారీ చేసింది.
అయితే సమాచారం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ఆన్లైన్ పెట్టినప్పటికీ హర్యానా సర్కారు మాత్రం తమ మంత్రుల వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడకపోవడం విశేషం. మంత్రులు ప్రజా ప్రతినిధులని, వారి ఆస్తుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించాల్సిందేనని కపూర్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు వెల్లడించడం లేదని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు.