కాకినాడలో రుబాబు
గ్రౌండ్‌ఫ్లోర్‌లో మాయాజాలం
నిరుపేదలనూ వదలని తమ్ముళ్లు
అధికారులున్నా ప్రేక్షకపాత్రేl
లాటరీ పేరుతో మాయాజాలం
ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు రక్షకులుగా ఉండాలన్నది క్రమేపీ కనుమరుగువుతోంది. తొమ్మిదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు తమ చేష్టలతో చెలరేగిపోతున్నారు. మిణుకుమిణుకుమంటూ ఉన్న నమ్మకాన్ని కూడా తుడిచేస్తున్నారనడానికి ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్న ఉదంతాలే ఉదాహరణలు. మూడు నెలల కిందట పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పేదల భూములు ఆక్రమించడానికి ప్రయత్నించడమే కాకుండా అధికారుల మార్పులు, చేర్పుల్లో కూడా జోక్యం చేసుకొని అభాసుపాలవుతున్నారు. తాజాగా అగ్నిమాపక శకటాలను, సిబ్బందిని కూడా తన సొంతానికి వినియోగించుకొని పంట పొలాలకు నీళ్లు తోడించిన వైనం బయటపడి నవ్వులపాలైన విషయం పాఠకులకు తెలిసిందే. బడుగులు, బాధితుల గొంతై ‘సాక్షి’ నినదించడంతో తోకముడుస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రమైన కాకినాడ సమీపంలో ఫ్లాట్ల కేటాయింపుల్లో మాయాజాలంతో, నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు రు‘బాబు’ ప్రదర్శించడంతో ఏళ్ల తరబడిగా వేచి చూసిన లబ్ధిదారులు కంగుతిన్నారు. అధికారుల సమక్షంలో సాగిన ఈ దందాలో వారిది ప్రేక్షకపాత్రగా మిగిలిపోయింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పై నేతలు సమస్తం దోచుకుంటుంటే ఆ వారసత్వాన్ని నిలబెట్టకపోతే ఎలా అనుకుంటున్నారేమో అదే బాట పడుతున్నారు కాకినాడలో మరో బాబు. తన పేరు బయటకు రాకుండా అనుచర గణంతో వసూళ్ల రాజాల అవతారమెత్తించి లక్షలు వెనకేసుకుంటున్నాడు. అధికారం తమ చేతిలో ఉందన్న అహంతో అధికారులను బేఖాతరు చేస్తూ లావాదేవీలతో సొమ్ము చేసుకుంటున్నాడు. కాకినాడ పర్లోపేటలో నిరుపేదలకు ప్లాట్లు కేటాయింపులో హస్తలాఘవం ప్రదర్శించడంతో లబ్థిదారులు లబోదిబోమంటున్నారు. దోపిడీ అంతా కళ్లెదుటే జరిగిపోతున్నా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవక తప్పడం లేదు.
జరుగుతున్నదిలా...
జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌కు కోసెడు దూరంలో ఉంది పర్లోపేట. ఈ పేటలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనంలో ఫ్లాట్ల కోసం నాలుగన్నరేళ్లుగా సుమారు 1000 మంది దరఖాస్తు చేసుకుని కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇందులో సుమారు 800 మంది రూ.20 నుంచి రూ.26వేలు వంతున డీడీలు తీసి సొమ్ములు చెల్లించి ఇక ఈరోజో, రేపో కేటాయింపులు చేస్తారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం బుధవారం రానే వచ్చింది. ఇదే అదనుగా బాబు, బాబు మనుషులు కూడా గద్దల్లా వాలిపోయారు. 492 ఫ్లాట్లు కేటాయింపునకు నిర్వహించిన లాటరీలో మాయాజాలంచేసి సుమారు రూ.15 లక్షలు మూటగట్టుకుపోయారు. లాటరీ తీసి ఎవరి పేరున చీటీ వస్తే ఆ లబ్థిదారుకు ఆ ఫ్లాట్ కేటాయించాలి. కానీ 492 ప్లాట్లలో గ్రౌండ్ ఫ్లోర్లో 50పైబడే ఉన్న ఫ్లాట్లను కాకినాడ నగరంలోని ఆ బాబు ముఖ్య అనుచరుడు, జగన్నాథపురానికి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త తన గుప్పెట్లో పెట్టుకుని సొమ్ము చేసుకున్నాడు. లాటరీ వ్యవహారం తూతూ మంత్రమయింది. ఎంపికలోనే ‘పచ్చ’పాతం చూపించడంతో లబ్ధిదారులు మండిపడుతున్నా ఫలితం లేకపోయింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఎంపిక జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని గృహనిర్మాణ అధికారులు తప్పించుకుంటున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్ విడిచిపెట్టేసి పైన ఉన్న రెండు ఫ్లోర్లలో లాటరీలో వచ్చిన వారికే (ఎంపికలో తమకునచ్చిన వారికి, సొమ్ములు ఇచ్చిన వారికి తెలుగు తమ్ముళ్లు కట్టబెట్టారు) కేటాయించారు. చివరకు గ్రౌండ్‌ఫ్లోర్‌కు వచ్చేసరికి అధికారికంగా లాటరీ తీసి కేటాయింపులు జరిపినట్టే జరిపి ఆ ఫ్లాట్లకు రేటు నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్‌ను రూ.30వేలు తక్కువగాకుండా పబ్లిక్‌గా అమ్మకాలు చేపట్టారు. లాటరీలో ఫ్లాట్ వచ్చినా వసూళ్లకు తెగబడ్డారు. ‘లాటరీ వచ్చింది కదా ... డబ్బులెందుకు ఇవ్వాలని’ లబ్థిదారులు ప్రశ్నిస్తే ‘ఇంత కష్టపడి మీకు అప్పగిస్తున్నందుకు రూ.30వేలు ఇవ్వలేరా, మీకు ఇçష్టం లేకపోతే చెప్పండి పైఫ్లాట్ల వారికి కేటాయించేస్తామని’ అదిరించి బెదిరించి మరీ గుంజుకుంటున్నారు. గూడు కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తుండటంతో గత్యంతరం లేక గ్రౌండ్‌ఫ్లోర్ కావడంతో విచిపెట్టలేక అప్పటికప్పుడు అప్పులుతెచ్చి మరీ అనుచరుల చేతులను తడపక తప్పలేదంటూ వాపోతున్నారు. జగన్నాథపురానికి చెందిన బాబు గారి అనుచరుడు ఆధ్వర్యంలో నిస్సిగ్గుగా ఈ దందా సాగింది. అ«క్కడే ఉన్న అధికారుల కళ్లముందే సాగుతున్నా చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.