రుబాబు చేస్తాడా?
ఇద్దరి మధ్య అగ్గి రాసుకుంటే చాలు... ముందొచ్చే మాట ‘ఏంట్రా నీ రుబాబు..’. అసలు ‘రుబాబు’.. అనే పదాన్ని వాడటం మాస్‌కి ఓ రివాజు. ఇక దాని తర్వాత జరిగేది కొట్టేసుకోవడమే. ఇలాంటి వ్యవహారాలు బాగా తెలిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. అందుకే దానికి తగ్గట్టుగా టైటిల్, స్క్రిప్ట్, హీరో పాత్ర చిత్రణ... ఉండేలా చూసుకుంటారాయన. త్వరలో ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు పూరీ. బండ్ల గణేశ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రుబాబు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. టైటిల్ ‘రుబాబు’.
హీరో ‘ఎన్టీఆర్’. దర్శకుడు పూరీ... ఇక ఈ సినిమా తీరుతెన్నులు ఏ తరహాలో ఉండబోతున్నాయో ప్రత్యేకించి చెప్పాలా! పూరీ సినిమాల్లో హీరోలు సామాన్యులుగా కనిపిస్తారు. కానీ అసాధారణమైన పనులు చేస్తుంటారు. మరి ఇందులో ఎన్టీఆర్ పాత్రను పూరీ ఎలా డిజైన్ చేశారో చూడాలి. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నట్లు తెలిసింది. మహేశ్‌ని ‘పోకిరి’లో పోలీస్‌గా చూపించారు పూరీ. ఆ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. త్వరలో ఆయన తారక్‌ని పోలీస్‌గా చూపించబోతున్నారు. మరి సేమ్ ఫీట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.