పవర్‌ఫుల్ పోలీస్‌గా...
పూరి జగన్నాథ్ తన హీరోను పోలీస్‌గా చూపించాడంటే... ఆ సినిమా హిట్. శివమణి, పోకిరి, గోలీమార్ చిత్రాలే అందుకు ఉదాహరణలు. ప్రస్తుతం చిన్న ఎన్టీఆర్‌ని శక్తిమంతమైన పోలీస్ అధికారిగా చూపించే పనిలో ఉన్నారు పూరి. ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 10 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ -‘‘వాణిజ్య విలువలతో కూడిన భిన్నమైన కథాంశంతో పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ఎన్టీఆర్ పాత్ర మాస్‌ని ఉర్రూతలూగిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి, దేవిశ్రీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా మ్యూజికల్‌గా సంచలనం సృష్టిస్తుందని నమ్మకంగా చెప్పగలను. దేవిశ్రీ అందించిన స్వరాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. వైజాగ్, హైదరాబాద్‌లతో పాటు విదేశాల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం.
జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, అలీ, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సప్తగిరి, రమాప్రభ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.