పెదవి విప్పిన సైరస్ మిస్త్రీ
ముంబై : మార్కెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతూ టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. నేడు ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు. ఈ 24 గంటలు జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి. ఈ మధ్యాహ్నం లోపు ఆయన బొంబాయి హైకోర్టు ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నాయి. కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదని, వ్యాజ్యాన్ని దాఖలు చేస్తాం అనే మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని పల్లోంజి గ్రూప్ తెలిపింది. కోర్టుకు వెళ్లాలంటే పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు.
టాటా గ్రూప్ ముందస్తు జాగ్రత్తలు
మరోవైపు టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలు కోర్టులో తమ వాదనలు వినిపించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు పడినట్టు తెలిసింది. టాటా గ్రూప్ హైకోర్టులో ముందస్తుగా ఓ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేయగా... మిస్త్రీ కూడా టాటా సన్స్‌కు, రతన్‌టాటాకు, సర్ దోరబ్జీ ట్రస్ట్‌లకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ తాను ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని మిస్త్రీ పేర్కొన్నారు. ఏకపక్షంలో వాదనలు మాత్రమే వినకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేలా ఈ కేవియట్ పిటిషన్లు దోహదం చేయనున్నాయి.
సీఈవోలతో రతన్ టాటా భేటీ
సోమవారం జరిగిన అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, తన గ్రూప్ సీఈవోలందరితో భేటీ అయ్యారు. గ్రూప్ హెడ్ ఆఫీసు బొంబాయిలో ఈ భేటీ జరిగింది. ఇదేమీ యజమాన్య పరంగా వస్తున్న యుద్ధం కాదని మిస్త్రీ తొలగింపుపై రతన్ టాటా వ్యాఖ్యానించారు. సంబంధిత వ్యాపారాల్లో సహ అధినేతలు ఎక్కువగా దృష్టిసారించాలని రతన్ టాటా ఆదేశించారు. తన ఎంపిక స్వల్పకాలం మాత్రమేనని, కొత్త చైర్మన్ ఈ పదవికి త్వరలోనే ఎంపికవుతారని పేర్కొన్నారు. మార్కెట్ పొజిషన్‌పై దృష్టిసారిస్తూనే, పోటీవాతావరణంపై కూడా ఫోకస్ చేయాలని గ్రూప్ సీఈవోలకు రతన్ టాటా తెలిపారు.