Ruby season
-
కొనుగోల్ ఏది?
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో రబీ వరికోతలు ఆరంభమైనా కొనుగోలు కేంద్రాల ఊసే కనిపించడం లేదు. అధికారులంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండడంతో రైతాంగం గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. మద్దతు ధర పొందాలని ఆర్భాటంగా ప్రకటనలు చేసే అధికార యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఖరీఫ్‌లో రెండు నెలలపాటు విక్రయాలు సాగగా... రబీలో మాత్రం మొత్తం ధాన్యం ఒకేసారి తరలివస్తుంది. ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అధికారులు కొనుగోళ్ల ఊసే తీయకపోవడంతో అన్నదాతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతు చేతికొచ్చి న పంటను అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. జిల్లాలో రబీ సీజన్ వరి సాధారణ విస్తీర్ణం 1,38,228 హెక్టార్లకు గాను పరిస్థితులు అనుకూలించడంతో 2,06,350 హెక్టార్లలో సాగు చేశారు. 13.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించే అవకాశం ఏర్పడింది. కొన్ని చోట్ల రైతులు నేరుగా రైస్‌మిల్లర్లకు అమ్ముకున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో భారీగానే సేకరణ జరగనుంది. గతేడాది 530 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్లో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమై మార్కెట్‌యార్డులకు ధాన్యం తరలివస్తోంది. కొన్నిచోట్ల గతేడాది ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోస్తున్నారు. మరికొందరు కల్లాల వద్దే ఉంచుతున్నారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి కల్లాల వద్దే కొనుగోలు ప్రారంభిస్తున్నారు. ఎన్నిరోజులు కల్లంలో ఉంచాలనే భావనతో రైతులు సైతం ధాన్యం త్వరగా అమ్మడానికి చూస్తున్నారు. సన్నాహాలు చేస్తున్నామంటున్న అధికారులు గతేడాది 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి సాగు విస్తీర్ణం పెరగడంతో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 617 కేంద్రాలు ఏర్పాటు చేసేం దుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇవి గతేడాదికంటే 87 కేంద్రాలు అదనం. 311 ఐకేపీ కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, గిరిజ న సహకార సంస్థ ద్వారా 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గన్నీసంచులు, ఇతర సామగ్రి సేకరణ, సిబ్బంది శిక్షణ ప్రక్రియకు సన్నద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తామని అధికారు లు చెబుతున్నారు. గతానుభవాలు దృష్టిలో ఉంచుకుని లోపాల సవరణకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. రెండు మూడు మిల్లులను సంయుక్తపరిచి ఒక మిల్లు సామర్థ్య స్థలాన్ని బట్టి ఎంతమేర కొనుగోలు చేయాలో పరిమితి విధించే పనిలో నిమగ్నమయ్యారు. కొనుగోలు కేంద్రాలు పోను మిగతా చోట్ల మిల్లర్లు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
ఏదో ఇచ్చారు...!
మహబూబ్‌నగర్ వ్యవసాయం,న్యూస్‌లైన్: రబీ సీజన్ ముగిశాక అధికారులు తీరిగ్గా స్ప్రింక్లర్ల పంపీణికి సిద్ధమయ్యారు.దీంతో అవి అవసరానికి దక్కే అవకాశం లేకుండా పోయింది.రబీ ప్రారంభం కాకముందునుంచీ అధికారులు వీటి పంపిణీకి చొరవ చూపకపోవడంతో ఇప్పుడు అవి అన్నదాతలకు ఎందుకూ ఉపయోగ పడలేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందనే చందంగా రైతుల పరిస్థితి తయారైంది. వ్యవసాయానికి రూ.కోట్ల బడ్జెట్ కేటాయించినా అది రైతుల అవసరాలను తీర్చడం లేదు. నూనెగింజలు,మొక్కజొన్న పంటల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2004-05 వార్షిక సంవత్సరంలో సమగ్ర నూనెగింజలు,పప్పుధాన్యాలు పామాయిల్ మరియు మొక్కజొన్న అభివృద్ధి పథకాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించారు.ఈ పథకానికి 75శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం,25శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే చిన్నసన్నకారు రైతులకు 50శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్,నీటి సరఫరా పైపులను ఇవ్వవలసిఉంటుంది.జిల్లాలో వేరుశనగ రైతులకు ఈ పథకం కింద 2011-12వార్షిక సంవత్సరంలో 7వేలకు పైగా యూనిట్లు పంపిణీ చేయగా 2012-2013వార్షిక సంవత్సరం 2వేల యూనిట్లు తగ్గించి 5వేల యూనిట్లకు పైగా స్ప్రింకర్లను పంపిణి చేశారు. కాగా ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసి ఈ ఏడాది 2వేల యూనిట్లకు కోత విధించి 3 యూనిట్ల పంపీణికి ప్రభుత్వం సిద్ధపడింది. రబీముగిసిన తరువాత పిబ్రవరి మాసం చివరివారంలో స్ల్రింక్లర్ల పంపిణీకి అధికారులు పూనుకున్నారు. మార్చి నెల మొదటివారంలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ పథకం డబ్బులు ట్రెజరీ ఫ్రీజ్ అయ్యాయి.చివరకు వెనక్కు వెళ్లాయి. పెరిగిన రేటుతో గందరగోళం ఒక్కో స్ప్రింక్లర్ హెక్టర్ యూనిట్లో ఒక హెక్టార్‌లోపు సాగు చేసే రైతులకు 8 రకాల వస్తువులకు గతేడాది రూ.14804 పూర్తిధర కాగా అందులో రూ.7402 50శాతం సబ్సిడీగా పోగా రూ. 7402 రైతు భరించాలి.అంతేకాకుండా ఈ ధరలో 30 పైపులను ఇచ్చేవారు.దాంతోపాటు 5శాతం వ్యాట్ రూ.740 కలుపుకొని మొత్తం రూ.8,142 చెల్లించేవారు. ఇలా రెండు హెక్టార్ల లోపు సాగుచేసిన రైతులు రూ.9,652 చెల్లించేవారు. ఈ ఏడాది మాత్రం రైతులకు కోలుకోలేని దెబ్బను కొ ట్టింది. గతేడాది కంటే అధికంగా హెక్టారుకు రూ. 2775 పెరిగిందన్నమాట. గతంలో ఉన్న ధరలకు స్ప్రిం క్లర్లు పంపిణీ చేసే కంపెనీలు ముందుకు రావడం లేదనే సాకుతో ఇలా భారం వేశారు. ఈ ఏడాది పెంచిన ధరల ప్రకారం యూనిట్ ఖరీదు రూ.18,417లు కాగా పూర్తిధర రూ.7,500 మాత్రమే 50శాతం సబ్సిడీగా భరిస్తోం ది. అయిదు శాతం వ్యాట్ కలుపుకొని రూ.10,917 ల ను రైతులు చెల్లించారు. ఇలా రెండు హెక్టార్ల లోపు సాగుచేసిన రైతులు రూ.10,974 చెల్లించాల్సి వచ్చింది. కానీ అధికారులు వీటి పంపిణీపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో 59 యూనిట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగునీటి పైపుల ధరలను కూడా గతేడాది కంటే ఎక్కువ ధర నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది. 4వేల దరఖాస్తులకు 62 మాత్రమే అందజేత... ప్రభుత్వం ఈ ఏడాది 3170 స్ప్రింక్లర్లు, 750 సాగునీటి పైపుల పంపీణీకి సిద్దపడింది.కాగా రబీ సీజన్ ప్రారంభం కాకముందే వీటి పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. రైతులు తమకు స్ప్రింక్లర్లకోసం రబీ సీజన్ ప్రారంభం కాకముందు నుంచే వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది.కొందరు రైతులు డీడీలు కట్టి సంబంధిత అధికారులకు అందజేశారు.రైతుల నుండి అధికారులు 4వేలకు పైగా దరఖాస్తులను తీసుకొని తమ వద్ద ఉంచుకున్నారు.కాగా స్ప్రింక్లర్ల రేటును నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలాయపన చేయడంతో అసలుకే మోసం వచ్చినట్లయింది. రబీ సీజన్ ముగిసే నెల ఫిబ్రవరిలో వీటి ధరను నిర్ణయించి, రాష్ట్రం అంతటికి ఒకే కంపెనీకి వీటి పంపిణీ భాద్యతను అప్పగించింది. అధికారులు 59 స్ప్రింక్లర్ యూనిట్లు,3 సాగునీటి పైపుల యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారు. అధికారుల నుండి ఉత్తర్వులు వెలువడి వీటి పంపిణీకి శ్రీకారం చుట్టేలోగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీంతో నిధులు ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి.ఇలా రూ. 74 లక్షల చివరకు వెనక్కి వెళ్లాయి. -
ఉచితమేగా.. కోతేద్దాం
-
ఉచితమేగా.. కోతేద్దాం
* కరెంటు కోతలతో సాగు కుదేలు * నికరంగా 3 గంటలైనా అందని దైన్యం * కరెంటు కోతలతో సాగు కుదేలు * నికరంగా 3 గంటలైనా అందని దైన్యం * తాజా ఆదేశాలతో మరిన్ని కష్టాలు * కోత పడ్డ కరెంటును భర్తీ చేయరట * ప్రభుత్వ అలసత్వమే అసలు సమస్య * డిమాండ్ అంచనా వేయడంలో వైఫల్యం * బొగ్గు నిల్వలు పెంచుకోవడంపై దృష్టే లేదు * ఇతర కేటగిరీల కంటే సాగుకే అధిక కోతలు రైతు గోడు నిన్న: భారీ వర్షాలు, వరదలు, కరువు కారణంగా లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్ పంట దెబ్బతిని రైతు కుదేలయ్యాడు. కోలుకోవడమే కష్టమనుకున్నాడు. నేడు: లేట్ ఖరీఫ్, రబీ పంటలు ప్రస్తుతానికి కాస్త ఆశాజనకంగా ఉన్నారుు. భూగర్భ జలాలూ ఉన్నారుు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగుకు 3, 4 గంటలు కూడా కరెంటు అందడం లేదు. ఉచిత కరెంటే కదా.. కోత కోస్తే మనకొచ్చే నష్టమేముందన్న రీతిలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి రేపు?: గృహావసరాలకు డిమాండ్ ఎక్కువగా ఉండని ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, కీలకమైన వూర్చిలో ఇంకెంతగా దిగజారుతుందోనని రైతులు ఇప్పటినుంచే హడలిపోతున్నారు. గంట కూడా ఇస్తలేరు.. పంటలకు కరెంటు సరిగా ఇస్తలేరు. కరెంటు పొయిందంటే మళ్లీ వస్తలేదు. గంట గంటకు కట్ అయితాంది. ఇంతకుముందు 7 గంటలు రాకపోతే మళ్లీ ఇచ్చెటోళ్లు. ఇప్పుడు టైం అంటే టైమే. ఆ టైంలో ఇవ్వకపోతే మళ్లీ ఇస్తలేరు. పంటలకు చాలా కష్టమైతాంది. కరెంటు లేకపోతే పంటలెట్లా? - కొండ శేషయ్య (గంటుపల్లి, వర్గల్ మండలం, మెదక్) సాక్షి, హైదరాబాద్: లేట్ ఖరీఫ్, రబీ పంటలు ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉన్నారుు. భూగర్భ జలాలూ ఉన్నారుు. అయినా సరే, పరిస్థితి అల్లుడి నోట్లో శని చందంగా మారింది. సర్కారు అలసత్వం కారణంగా పంటకు కరెంటు మంట అంటుకుంది. సాగు సాగని దుస్థితి. ఆరుగాలం శ్రమిస్తున్నరైతన్నకు కరెంటు కోతలు అక్షరాలా షాకిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కరువు కారణంగా లక్షలాది ఎకరాల్లో ఇప్పటికే ఖరీఫ్ దెబ్బ తిన్న విషయం తెలిసిందే. దాంతో రైతులు తమ ఆశలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న పంటలపైనే పెట్టుకుంటే, కరెంటు దెబ్బకు అవి కాస్తా అడియాసలు అయ్యేలా ఉన్నాయి. గృహావసరాలు తదితరాలకు డిమాండ్ ఎక్కువగా ఉండని ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, కీలకమైన వూర్చిలో ఇంకెంతగా దిగజారుతుందోనని అన్నదాత ఇప్పటినుంచే హడలిపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఏడు గంటలు కరెంటిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఎలాగూ ఇచ్చేది ఉచిత కరెంటే కదా, ఎంత కోత పెట్టినా పర్లేదు లెమ్మనే ధోరణి అడుగడుగునా కన్పిస్తోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాగుకు 3, 4 గంటలు కూడా కరెంటు అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ట్రిప్పవడం వంటి పలు కారణాలతో గంటకు సగటున పావుగంట పాటైనా సరఫరా ఆగిపోతోంది. దాంతో తడిపిన మడినే పదేపదే తడపాల్సి వస్తోంది. చివరి మళ్లకు నీరందని పరిస్థితి తలెత్తుతోంది. ఈ కష్టాలు చాలవన్నట్టు ప్రభుత్వ తాజా చర్యలు రైతు గుండె మంటను మరింతగా పెంచుతున్నాయి. 7 గంటల కరెంటులోఏ పూటైనా నిర్ణీత పరిమాణంలో ఇవ్వలేకపోతే, కోత పడిన మేరకు రెండో పూటలో సర్దుబాటు చేసేవారు. ఇకపై అలా చేయొద్దంటూ అధికారులను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. అంటే కోత పడ్డ కరెంటుకు ఇకనుంచి పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే! సరఫరా సగమేనంటున్న అధికారులు: రాష్ట్రంలో సుమారు 10 వేల దాకా వ్యవసాయ ఫీడర్లున్నాయి. వీటిలో సగానికి సగం ఫీడర్లకు 7 గంటల కంటే తక్కువ సరఫరా చేస్తున్నామని విద్యుత్ సంస్థలే తమ అధికార నివేదికలో స్పష్టం చేస్తున్నాయి! అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఏకంగా 90 శాతం, అంటే 9,000 ఫీడర్లకు పూర్తి సమయం కరెంటు సరఫరా కావడం లేదంటున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో ఎక్కడా 7 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని వాపోతున్నారు. కోతలకు నిరసనగా ఎక్కడికక్కడ విద్యుత్ సబ్స్టేషన్లను రైతులు ముట్టడిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. సర్దుబాటుకు మంగళం!: వ్యవసాయానికి రోజులో 7 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని.. ఒకవేళ సరఫరా తగ్గితే తర్వాత గానీ, మర్నాడు గానీ ఆ మేరకు సర్దుబాటు చేయాలనే నిబంధన ఉండేది. ఒక వ్యవసాయ ఫీడర్‌కు పగలు 4 గంటల బదులు 2 గంటలే సరఫరా అయితే రాత్రి 5 గంటలివ్వడం ద్వారా దాన్ని సర్దుబాటు చేసేవారు. ఒకవేళ రాత్రి తగ్గితే మర్నాటి పగలు సర్దుబాటు చేసేవారు. ఈ నిబంధనను ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. నిర్ణీత సమయంలో ఎంత సరఫరా జరిగితే అంతేనని, తర్వాత సర్దుబాటు చేయొద్దని ఆదేశించింది. దాంతో సరఫరా సమయంలో ఫీడర్లు తెగిపోయో, మరో కారణంతోనో కోత పడితే ఆ మేరకు తర్వాత సర్దుబాటు చేయడం లేదు. అలా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. 2-3 గంటలే కరెంట్ వస్తాంది రోజుకు 2-3 గంటలే ఇచ్చి సరిపెడుతున్నరు. ఇదేందంటె పై నించి పోయిందంటున్నరు. తాగే నీళ్లకు కూడా కష్టమైతాంది - సత్యనారాయణ, (గోవిందాపురం, మెదక్) కారణాలనేకం నిజానికి థర్మల్ విద్యుదుత్పత్తికి బొగ్గు సరఫరా తదితర సవుస్యలు తలెత్తడం కూడా కరెంటు కష్టాలను పెంచింది. అయితే ఆ సమస్యలకు ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఈ కీలక దశలో సాగుకు ఎలాగోలా కరెంటును సర్దుబాటు చేయూల్సి ఉండగా, ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఎడాపెడా కోతలకే మొగ్గు చూపుతూ, అంతటితో చేతులు దులుపుకుంటోంది. డిమాండ్‌ను సరిగా అంచనా వేసి విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోలేదు. జెన్కో ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలోనూ విఫలమైంది. పలు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఒక్కరోజుకు సరిపడినన్నే ఉన్నాయి. దాంతో వాటిని తక్కువ సామర్థ్యంతో నడపాల్సి వస్తోంది. బొగ్గు నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తే విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సరఫరా లోటు ఏర్పడినప్పుడు ఇతర విభాగాల వినియోగదారులకు కొంత మేరకు తగ్గించైనా సాగుకు ఇవ్వాల్సి ఉండగా పూర్తిగా విస్మరించారు. పెపైచ్చు వ్యవసాయానికే ఎక్కువగా కోతలు విధిస్తున్న పరిస్థితి. ఉదాహరణకు శుక్రవారం రాష్ట్రంలో 21 మిలియన్ యూనిట్ల మేరకు కరెంటు లోటు ఏర్పడింది. ఇందులో ఏకంగా 10 మిలియన్ యూనిట్ల దాకా వ్యవసాయానికే కోత పెట్టారు. కర్నూలులోనూ నిరసన కోసిగి రూరల్, న్యూస్‌లైన్: ఏడు గంటలు కరెంటివ్వకపోవడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లాలోనూ శనివారం అన్నదాత రోడ్డెక్కాడు. కోసిగి మండలం చింతకుంట, డి.బెళగల్, దొడ్డి గ్రామాలకు చెందిన 250 మంది రైతులు డి.బెళగల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ముందు కోసిగి-మంత్రాలయం రోడ్డుపై బైఠాయించి రెండు గంటలసేపు ధర్నా చేశారు. కనీసం 3 గంటలు కూడా సక్రమంగా కరెంటివ్వడం లేదంటూ వాపోయారు. -
మొలక వస్తుందో.. రాదో..
ప్రొద్దుటూరు/రాజుపాళెం, న్యూస్‌లైన్: శనగ పంట సాగు చేసిన రైతులు తుపాను ప్రభావం కారణంగా ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి విత్తనం సాగు చేసిన రైతులు వర్షం ప్రభావం కారణంగా మొలక వస్తుందా రాదా అని దిగులు చెందుతున్నారు. జిల్లాలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోనే అత్యధికంగా శనగ పంట ప్రతి ఏటా రబీ సీజన్లో సాగవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా పంట సాగుకు సిద్ధమయ్యారు. కాగా ఇటీవల వర్షాలు ఎక్కువగా పడటంతో గత వారం రోజులుగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అయితే అనుకోకుండా వచ్చిన తుపాను ప్రభావం కారణంగా భూమిలో తేమ శాతం పెరిగింది. దీంతో వేసిన విత్తనంపై రైతులు కలత చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా వరుసగా వర్షాలు పడుతుండటంతో భూమిలో వేసిన విత్తనం మొలక వస్తుందా రాదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రాజుపాళెం మండలంలోనే 10వేల హెక్టార్లకుపైగా శనగ పంట సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా ఇప్పటికే ఈ మండలంలో 2వేల ఎకరాల వరకు రైతులు పంట సాగు చేశారు. వర్షాలు ఆగకపోతే నష్టం తప్పదు ప్రతి ఏటా శనగ పంటను సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కూడా 15 ఎకరాలు కౌలుకు తీసుకుని విత్తనం వేశాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఆగకపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట మొలక వస్తుందో రాదోనని ఆందోళనగా ఉంది. - నరసింహా రెడ్డి. అర్కటవేముల రాజుపాళెం మండలం 7 ఎకరాల్లో పంట సాగు చేశాను ఇటీవల పడిన వర్షాల కారణంగా ముందుగానే శనగ పంటను 7 ఎకరాల్లో సాగు చేశాను. విత్తనం వేశాక వర్షాలు ఎక్కువయ్యాయి. వర్షం ఇంతటితోనైనా ఆగకపోతే సాగు చేసిన విత్తనం మొలకరావడం కష్టం. పాపిరెడ్డి, రైతు, అర్కటవేముల గ్రామం -
కోటి ఆశలతో..
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో అడపాదడపా వర్షాలు పడినా చెరువులు, జలాశయాలు పూర్తిగా నిండలేదు కానీ.. కొంత మేర నీరు చేరింది. ఎగువన కురిసిన వర్షాలు, కృష్ణా మిగులు జలాలతో పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు 41 టీఎంసీల నీరు చేరుకోవడంతో జలాశయం కొంత మేర జలకళ సంతరించుకుంది. రబీ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వరినారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. విత్తనాల డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర విభజ నిర్ణయంతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమ్మెలో ఉండటంతో సబ్సిడీతో అందజేసే విత్తనాలు ఈ సారి రైతులకు అందే పరిస్థితి అనుమానమే. దీంతో విత్తన కంపెనీలు, రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, బడా రైతులు విత్తన ధరలను అమాంతంగా పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన వ్యవసాయ పెట్టుబడులతో రైతులు అల్లాడుతున్నారు. సాగు ఆరంభంలోనే విత్తన ధరలు రైతులను బెంబేలెస్తున్నాయి. జిల్లాలో ముందస్తు రబీగా 2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. ఈ రబీలో బీపీటీ 5204 (జిలకర మసూరా) రకం, ఎంటీయూ 1010, వానపాములు, సుబ్బయ్య బుడ్డలు, పెద్ద బుడ్డలు సాగుచేస్తారు. అక్టోబరులో నార్లు పోసి నవంబరు, డిసెంబరులో నాట్లు వేస్తారు. ఇప్పటికే బోర్లు, బావుల కింద నెల్లూరు సన్నాలు, జేజేఎల్, 1001 రకాలు నార్లు పోశారు. విత్తనాల కోసం వెంపర్లాట వ్యవసాయాధికారులు 40 రోజుల నుం చి సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ రాయితీల పరంగా రైతులకు విత్తనాలు అందే పరిస్థితి లే దు. ప్రతి కిలోకు ప్రభుత్వం రూ.5 రాయితీ ఇస్తోంది. రాయితీ విత్తనాల కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ భారీ ఎత్తున నిధులు సిద్ధం చేసింది. ఏపీ సీడ్స్‌కు ఇండెంట్ కూడా ఇచ్చింది. ఏపీ సీడ్స్‌లో వ్యవసాయాధికారులు అనుమతిస్తే విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. సమ్మెలో అధికారులు ఉండటంతో ప్రస్తుతం విత్తనాలు పంపిణీ చే సే పరిస్థితి లేదు. గూడూరు, వింజ మూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అనుమతి మేరకు ఏపీ సీడ్స్ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. కానీ పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వం అందించే రాయితీతో 30 కేజీల బస్తా రూ.600కు లభించనుంది. దాన్నే బయట మార్కెట్లో కొనాలంటే రూ.1000 చెల్లించాలి. పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో సేద్యపు ఖర్చులు కూడా పెరిగాయి. డీజిల్ లీటరు రూ.58కి చేరడంతో ట్రాక్టరు సేద్యం ఖర్చులు గతేడాది కంటే ఈ ఏడాది 20 శాతం అదనంగా పెంచారు. ఎకరా వరి నాటేందుకు గతేడాది రూ.20 వేలు ఖర్చు కాగా ఈ ఏడాది రూ.25 వేలు పైగా అయ్యే పరిస్థితి ఉంది. కూలీల కొరత ఉండటంతో వారు కూడా కూలీ ధర పెంచారు. గతేడాది ఆడవారికి రూ.100 కూలీ ఇవ్వగా ఈ ఏడాది రూ.150కి పెంచారు. మగవారికి రూ.200 నుంచి 300కు పెరిగింది. పెరిగిన ఎరువుల ధరలు రెండేళ్ల క్రితం యూరియా ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.400కు కొ నాల్సి వస్తోంది. ఎంఆర్పీ ధర రూ.280 అయినప్పటికీ రూ.400కు తక్కువ ఎరువుల దుకాణ యజమానులు ఇవ్వడం లేదు. డీఏపీ రూ.500-1300కు పెరిగింది. విత్తనాల బస్తా రూ.500 ఉండగా, నేడు వెయ్యికి చేరింది. పొటాష్ రూ.480 ఉండగా, నేడు రూ.890కి చేరింది. ఈ విధంగా పెట్టుబడులు ఖర్చుల పెరిగిన మేరకు దిగుబడులు లేకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండటంతో రైతులు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లాభమైనా, నష్టమైనా వ్యవసాయం చేస్తున్నారు. సాగు భారం పెరిగింది: ఉపాధి పనుల నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడి కూలీ రేటు అధికంగా పెరిగింది. విత్తనాలు, ఎరువుల ధరలు రెట్టింపయ్యా యి. ట్రాక్టరు సేద్యం ఖర్చులు పెరిగాయి. ఎకరాకు రూ.25 వేలు పైగా ఖర్చవుతున్నా దిగుబడులు సక్రమంగా లేకపోవడంతో నష్టాల్లోనే సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. - సుబ్బరాయుడు, వరికుంటపాడు