కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో రబీ వరికోతలు ఆరంభమైనా కొనుగోలు కేంద్రాల ఊసే కనిపించడం లేదు. అధికారులంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండడంతో రైతాంగం గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. మద్దతు ధర పొందాలని ఆర్భాటంగా ప్రకటనలు చేసే అధికార యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఖరీఫ్‌లో రెండు నెలలపాటు విక్రయాలు సాగగా... రబీలో మాత్రం మొత్తం ధాన్యం ఒకేసారి తరలివస్తుంది. ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అధికారులు కొనుగోళ్ల ఊసే తీయకపోవడంతో అన్నదాతలు నైరాశ్యంలో మునిగిపోయారు.
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతు చేతికొచ్చి న పంటను అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. జిల్లాలో రబీ సీజన్ వరి సాధారణ విస్తీర్ణం 1,38,228 హెక్టార్లకు గాను పరిస్థితులు అనుకూలించడంతో 2,06,350 హెక్టార్లలో సాగు చేశారు. 13.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించే అవకాశం ఏర్పడింది. కొన్ని చోట్ల రైతులు నేరుగా రైస్‌మిల్లర్లకు అమ్ముకున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో భారీగానే సేకరణ జరగనుంది. గతేడాది 530 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమై మార్కెట్‌యార్డులకు ధాన్యం తరలివస్తోంది. కొన్నిచోట్ల గతేడాది ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోస్తున్నారు. మరికొందరు కల్లాల వద్దే ఉంచుతున్నారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి కల్లాల వద్దే కొనుగోలు ప్రారంభిస్తున్నారు. ఎన్నిరోజులు కల్లంలో ఉంచాలనే భావనతో రైతులు సైతం ధాన్యం త్వరగా అమ్మడానికి చూస్తున్నారు.
సన్నాహాలు చేస్తున్నామంటున్న అధికారులు
గతేడాది 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి సాగు విస్తీర్ణం పెరగడంతో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 617 కేంద్రాలు ఏర్పాటు చేసేం దుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇవి గతేడాదికంటే 87 కేంద్రాలు అదనం. 311 ఐకేపీ కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, గిరిజ న సహకార సంస్థ ద్వారా 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గన్నీసంచులు, ఇతర సామగ్రి సేకరణ, సిబ్బంది శిక్షణ ప్రక్రియకు సన్నద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తామని అధికారు లు చెబుతున్నారు.
గతానుభవాలు దృష్టిలో ఉంచుకుని లోపాల సవరణకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. రెండు మూడు మిల్లులను సంయుక్తపరిచి ఒక మిల్లు సామర్థ్య స్థలాన్ని బట్టి ఎంతమేర కొనుగోలు చేయాలో పరిమితి విధించే పనిలో నిమగ్నమయ్యారు. కొనుగోలు కేంద్రాలు పోను మిగతా చోట్ల మిల్లర్లు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
కొనుగోల్ ఏది?
Published Fri, May 2 2014 12:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement