ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో అడపాదడపా వర్షాలు పడినా చెరువులు, జలాశయాలు పూర్తిగా నిండలేదు కానీ.. కొంత మేర నీరు చేరింది. ఎగువన కురిసిన వర్షాలు, కృష్ణా మిగులు జలాలతో పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు 41 టీఎంసీల నీరు చేరుకోవడంతో జలాశయం కొంత మేర జలకళ సంతరించుకుంది. రబీ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వరినారు పోసేందుకు సిద్ధమవుతున్నారు.
విత్తనాల డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర విభజ నిర్ణయంతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమ్మెలో ఉండటంతో సబ్సిడీతో అందజేసే విత్తనాలు ఈ సారి రైతులకు అందే పరిస్థితి అనుమానమే. దీంతో విత్తన కంపెనీలు, రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, బడా రైతులు విత్తన ధరలను అమాంతంగా పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన వ్యవసాయ పెట్టుబడులతో రైతులు అల్లాడుతున్నారు. సాగు ఆరంభంలోనే విత్తన ధరలు రైతులను బెంబేలెస్తున్నాయి. జిల్లాలో ముందస్తు రబీగా 2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. ఈ రబీలో బీపీటీ 5204 (జిలకర మసూరా) రకం, ఎంటీయూ 1010, వానపాములు, సుబ్బయ్య బుడ్డలు, పెద్ద బుడ్డలు సాగుచేస్తారు. అక్టోబరులో నార్లు పోసి నవంబరు, డిసెంబరులో నాట్లు వేస్తారు. ఇప్పటికే బోర్లు, బావుల కింద నెల్లూరు సన్నాలు, జేజేఎల్, 1001 రకాలు నార్లు పోశారు.
విత్తనాల కోసం వెంపర్లాట
వ్యవసాయాధికారులు 40 రోజుల నుం చి సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ రాయితీల పరంగా రైతులకు విత్తనాలు అందే పరిస్థితి లే దు. ప్రతి కిలోకు ప్రభుత్వం రూ.5 రాయితీ ఇస్తోంది. రాయితీ విత్తనాల కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ భారీ ఎత్తున నిధులు సిద్ధం చేసింది. ఏపీ సీడ్స్‌కు ఇండెంట్ కూడా ఇచ్చింది. ఏపీ సీడ్స్‌లో వ్యవసాయాధికారులు అనుమతిస్తే విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. సమ్మెలో అధికారులు ఉండటంతో ప్రస్తుతం విత్తనాలు పంపిణీ చే సే పరిస్థితి లేదు. గూడూరు, వింజ మూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అనుమతి మేరకు ఏపీ సీడ్స్ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. కానీ పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వం అందించే రాయితీతో 30 కేజీల బస్తా రూ.600కు లభించనుంది. దాన్నే బయట మార్కెట్‌లో కొనాలంటే రూ.1000 చెల్లించాలి.
పెరిగిన పెట్టుబడులు
ఈ ఏడాది డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో సేద్యపు ఖర్చులు కూడా పెరిగాయి. డీజిల్ లీటరు రూ.58కి చేరడంతో ట్రాక్టరు సేద్యం ఖర్చులు గతేడాది కంటే ఈ ఏడాది 20 శాతం అదనంగా పెంచారు. ఎకరా వరి నాటేందుకు గతేడాది రూ.20 వేలు ఖర్చు కాగా ఈ ఏడాది రూ.25 వేలు పైగా అయ్యే పరిస్థితి ఉంది. కూలీల కొరత ఉండటంతో వారు కూడా కూలీ ధర పెంచారు. గతేడాది ఆడవారికి రూ.100 కూలీ ఇవ్వగా ఈ ఏడాది రూ.150కి పెంచారు. మగవారికి రూ.200 నుంచి 300కు పెరిగింది.
పెరిగిన ఎరువుల ధరలు
రెండేళ్ల క్రితం యూరియా ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.400కు కొ నాల్సి వస్తోంది. ఎంఆర్‌పీ ధర రూ.280 అయినప్పటికీ రూ.400కు తక్కువ ఎరువుల దుకాణ యజమానులు ఇవ్వడం లేదు. డీఏపీ రూ.500-1300కు పెరిగింది. విత్తనాల బస్తా రూ.500 ఉండగా, నేడు వెయ్యికి చేరింది. పొటాష్ రూ.480 ఉండగా, నేడు రూ.890కి చేరింది. ఈ విధంగా పెట్టుబడులు ఖర్చుల పెరిగిన మేరకు దిగుబడులు లేకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండటంతో రైతులు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లాభమైనా, నష్టమైనా వ్యవసాయం చేస్తున్నారు.
సాగు భారం పెరిగింది:
ఉపాధి పనుల నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడి కూలీ రేటు అధికంగా పెరిగింది. విత్తనాలు, ఎరువుల ధరలు రెట్టింపయ్యా యి. ట్రాక్టరు సేద్యం ఖర్చులు పెరిగాయి. ఎకరాకు రూ.25 వేలు పైగా ఖర్చవుతున్నా దిగుబడులు సక్రమంగా లేకపోవడంతో నష్టాల్లోనే సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- సుబ్బరాయుడు, వరికుంటపాడు
కోటి ఆశలతో..
Published Tue, Oct 1 2013 4:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement