* కరెంటు కోతలతో సాగు కుదేలు
* నికరంగా 3 గంటలైనా అందని దైన్యం
* కరెంటు కోతలతో సాగు కుదేలు
* నికరంగా 3 గంటలైనా అందని దైన్యం
* తాజా ఆదేశాలతో మరిన్ని కష్టాలు
* కోత పడ్డ కరెంటును భర్తీ చేయరట
* ప్రభుత్వ అలసత్వమే అసలు సమస్య
* డిమాండ్ అంచనా వేయడంలో వైఫల్యం
* బొగ్గు నిల్వలు పెంచుకోవడంపై దృష్టే లేదు
* ఇతర కేటగిరీల కంటే సాగుకే అధిక కోతలు
రైతు గోడు
నిన్న: భారీ వర్షాలు, వరదలు, కరువు కారణంగా లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్ పంట దెబ్బతిని రైతు కుదేలయ్యాడు. కోలుకోవడమే కష్టమనుకున్నాడు.
నేడు: లేట్ ఖరీఫ్, రబీ పంటలు ప్రస్తుతానికి కాస్త ఆశాజనకంగా ఉన్నారుు. భూగర్భ జలాలూ ఉన్నారుు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగుకు 3, 4 గంటలు కూడా కరెంటు అందడం లేదు. ఉచిత కరెంటే కదా.. కోత కోస్తే మనకొచ్చే నష్టమేముందన్న రీతిలో ప్రభుత్వం ఆలోచిస్తోంది.
మరి రేపు?: గృహావసరాలకు డిమాండ్ ఎక్కువగా ఉండని ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, కీలకమైన వూర్చిలో ఇంకెంతగా దిగజారుతుందోనని రైతులు ఇప్పటినుంచే హడలిపోతున్నారు.
గంట కూడా ఇస్తలేరు..
పంటలకు కరెంటు సరిగా ఇస్తలేరు. కరెంటు పొయిందంటే మళ్లీ వస్తలేదు. గంట గంటకు కట్ అయితాంది. ఇంతకుముందు 7 గంటలు రాకపోతే మళ్లీ ఇచ్చెటోళ్లు. ఇప్పుడు టైం అంటే టైమే. ఆ టైంలో ఇవ్వకపోతే మళ్లీ ఇస్తలేరు. పంటలకు చాలా కష్టమైతాంది. కరెంటు లేకపోతే పంటలెట్లా?
- కొండ శేషయ్య (గంటుపల్లి, వర్గల్ మండలం, మెదక్)
సాక్షి, హైదరాబాద్: లేట్ ఖరీఫ్, రబీ పంటలు ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉన్నారుు. భూగర్భ జలాలూ ఉన్నారుు. అయినా సరే, పరిస్థితి అల్లుడి నోట్లో శని చందంగా మారింది. సర్కారు అలసత్వం కారణంగా పంటకు కరెంటు మంట అంటుకుంది. సాగు సాగని దుస్థితి. ఆరుగాలం శ్రమిస్తున్నరైతన్నకు కరెంటు కోతలు అక్షరాలా షాకిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కరువు కారణంగా లక్షలాది ఎకరాల్లో ఇప్పటికే ఖరీఫ్ దెబ్బ తిన్న విషయం తెలిసిందే. దాంతో రైతులు తమ ఆశలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న పంటలపైనే పెట్టుకుంటే, కరెంటు దెబ్బకు అవి కాస్తా అడియాసలు అయ్యేలా ఉన్నాయి. గృహావసరాలు తదితరాలకు డిమాండ్ ఎక్కువగా ఉండని ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, కీలకమైన వూర్చిలో ఇంకెంతగా దిగజారుతుందోనని అన్నదాత ఇప్పటినుంచే హడలిపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఏడు గంటలు కరెంటిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఎలాగూ ఇచ్చేది ఉచిత కరెంటే కదా, ఎంత కోత పెట్టినా పర్లేదు లెమ్మనే ధోరణి అడుగడుగునా కన్పిస్తోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాగుకు 3, 4 గంటలు కూడా కరెంటు అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ట్రిప్పవడం వంటి పలు కారణాలతో గంటకు సగటున పావుగంట పాటైనా సరఫరా ఆగిపోతోంది. దాంతో తడిపిన మడినే పదేపదే తడపాల్సి వస్తోంది. చివరి మళ్లకు నీరందని పరిస్థితి తలెత్తుతోంది. ఈ కష్టాలు చాలవన్నట్టు ప్రభుత్వ తాజా చర్యలు రైతు గుండె మంటను మరింతగా పెంచుతున్నాయి. 7 గంటల కరెంటులోఏ పూటైనా నిర్ణీత పరిమాణంలో ఇవ్వలేకపోతే, కోత పడిన మేరకు రెండో పూటలో సర్దుబాటు చేసేవారు. ఇకపై అలా చేయొద్దంటూ అధికారులను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. అంటే కోత పడ్డ కరెంటుకు ఇకనుంచి పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే!
సరఫరా సగమేనంటున్న అధికారులు: రాష్ట్రంలో సుమారు 10 వేల దాకా వ్యవసాయ ఫీడర్లున్నాయి. వీటిలో సగానికి సగం ఫీడర్లకు 7 గంటల కంటే తక్కువ సరఫరా చేస్తున్నామని విద్యుత్ సంస్థలే తమ అధికార నివేదికలో స్పష్టం చేస్తున్నాయి! అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఏకంగా 90 శాతం, అంటే 9,000 ఫీడర్లకు పూర్తి సమయం కరెంటు సరఫరా కావడం లేదంటున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో ఎక్కడా 7 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని వాపోతున్నారు. కోతలకు నిరసనగా ఎక్కడికక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్లను రైతులు ముట్టడిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.
సర్దుబాటుకు మంగళం!: వ్యవసాయానికి రోజులో 7 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని.. ఒకవేళ సరఫరా తగ్గితే తర్వాత గానీ, మర్నాడు గానీ ఆ మేరకు సర్దుబాటు చేయాలనే నిబంధన ఉండేది. ఒక వ్యవసాయ ఫీడర్‌కు పగలు 4 గంటల బదులు 2 గంటలే సరఫరా అయితే రాత్రి 5 గంటలివ్వడం ద్వారా దాన్ని సర్దుబాటు చేసేవారు. ఒకవేళ రాత్రి తగ్గితే మర్నాటి పగలు సర్దుబాటు చేసేవారు. ఈ నిబంధనను ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. నిర్ణీత సమయంలో ఎంత సరఫరా జరిగితే అంతేనని, తర్వాత సర్దుబాటు చేయొద్దని ఆదేశించింది. దాంతో సరఫరా సమయంలో ఫీడర్లు తెగిపోయో, మరో కారణంతోనో కోత పడితే ఆ మేరకు తర్వాత సర్దుబాటు చేయడం లేదు. అలా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.
2-3 గంటలే కరెంట్ వస్తాంది
రోజుకు 2-3 గంటలే ఇచ్చి సరిపెడుతున్నరు. ఇదేందంటె పై నించి పోయిందంటున్నరు. తాగే నీళ్లకు కూడా కష్టమైతాంది
- సత్యనారాయణ, (గోవిందాపురం, మెదక్)
కారణాలనేకం
నిజానికి థర్మల్ విద్యుదుత్పత్తికి బొగ్గు సరఫరా తదితర సవుస్యలు తలెత్తడం కూడా కరెంటు కష్టాలను పెంచింది. అయితే ఆ సమస్యలకు ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమే. ఈ కీలక దశలో సాగుకు ఎలాగోలా కరెంటును సర్దుబాటు చేయూల్సి ఉండగా, ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఎడాపెడా కోతలకే మొగ్గు చూపుతూ, అంతటితో చేతులు దులుపుకుంటోంది. డిమాండ్‌ను సరిగా అంచనా వేసి విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోలేదు. జెన్‌కో ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలోనూ విఫలమైంది. పలు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఒక్కరోజుకు సరిపడినన్నే ఉన్నాయి.
దాంతో వాటిని తక్కువ సామర్థ్యంతో నడపాల్సి వస్తోంది. బొగ్గు నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తే విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సరఫరా లోటు ఏర్పడినప్పుడు ఇతర విభాగాల వినియోగదారులకు కొంత మేరకు తగ్గించైనా సాగుకు ఇవ్వాల్సి ఉండగా పూర్తిగా విస్మరించారు. పెపైచ్చు వ్యవసాయానికే ఎక్కువగా కోతలు విధిస్తున్న పరిస్థితి. ఉదాహరణకు శుక్రవారం రాష్ట్రంలో 21 మిలియన్ యూనిట్ల మేరకు కరెంటు లోటు ఏర్పడింది. ఇందులో ఏకంగా 10 మిలియన్ యూనిట్ల దాకా వ్యవసాయానికే కోత పెట్టారు.
కర్నూలులోనూ నిరసన
కోసిగి రూరల్, న్యూస్‌లైన్: ఏడు గంటలు కరెంటివ్వకపోవడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లాలోనూ శనివారం అన్నదాత రోడ్డెక్కాడు. కోసిగి మండలం చింతకుంట, డి.బెళగల్, దొడ్డి గ్రామాలకు చెందిన 250 మంది రైతులు డి.బెళగల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ముందు కోసిగి-మంత్రాలయం రోడ్డుపై బైఠాయించి రెండు గంటలసేపు ధర్నా చేశారు. కనీసం 3 గంటలు కూడా సక్రమంగా కరెంటివ్వడం లేదంటూ వాపోయారు.
ఉచితమేగా.. కోతేద్దాం
Published Sun, Jan 12 2014 1:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement