Ruchi
-
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
ఉగాదిన ఏం చేయాలంటే..?
దుర్ముఖి నామ సంవత్సరం నుంచి నేడు మనం హేవిళంబి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం ఆచారం. అంతకన్నా ముందు అసలు ఉగాది రోజు ఏం చేయాలో చూద్దాం... ఉగాది సంప్రదాయం ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఆరోగ్యానికి అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులలో ఎలా స్నానం చేసినా, ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన తర్వాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. శుభ్రమైన దుస్తులు శుభం.. శుభం... ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టడం సులభం. – డి.వి.ఆర్. -
ఆ'రు'చుల పచ్చడి
ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ప్రతి రుచికి ఒక ప్రత్యేకత... అసలు ప్రతి రుచీ ఒక పచ్చడే! ఆ రుచి తీపి ఆ రుచి వగరు ఆ రుచి కారం ఆ రుచి పులుపు ఆ రుచి ఉప్పు ఆ రుచి చేదు ఆ రుచుల పచ్చళ్లు ఉగాదికి రుచి పచ్చళ్లు. తీపి బెల్లం పచ్చడి కావల్సినవి: బెల్లం – 100 గ్రాములు (తీపి ఇష్టపడేవారు మరికాస్త వేసుకోవచ్చు) అల్లం – 250 గ్రాములు (పావు కేజీ); పసుపు – పావు టీ స్పూన్; చింతపండు – 100 గ్రాములు; కారం – 6 టేబుల్ స్పూన్లు (కడాయిలో 2 టేబుల్స్పూన్ల నూనె వేసి, ఎండుమిర్చి వేయించి, పొడి చేసినది); ఉప్పు – తగినంత; మెంతులు – టేబుల్ స్పూన్ (వేయించి, పొడి చేయాలి) పోపు: కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – టీ స్పూన్; నూనె – 100 గ్రాములు. ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 10 రెబ్బలు; ఇంగువ – చిటికెడు తయారీ: అల్లంపై ఉన్న మట్టి అంతా పోయేలా కడగాలి. తర్వాత పొట్టు తీసి, నీళ్లన్నీ ఆరిపోయేలా పైన ఒక క్లాత్ కప్పి, రాత్రంతా అలాగే ఉంచేయాలి. అల్లం సన్నగా తరగాలి. అరకప్పు నీళ్లు వేడిచేసి దాంట్లో చింతపండు నానబెట్టాలి. పొయ్యి మీద కడాయి పెట్టి టీ స్పూన్ నూనె వేసి సన్నని మంట మీద అల్లం 3–4 నిమిషాలు వేయించి, చల్లారనివ్వాలి. మిక్సర్‌లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసి, కారం, పసుపు అల్లంలో వేసి మెత్తగా రుబ్బాలి. దీంట్లో బెల్లం వేసి, రుబ్బి, మెంతి పొడి కలపాలి. మూకుడులో నూనె పోసి పోపు దినుసులన్నీ వేసి, వేయించి ఈ మిశ్రమాన్ని అల్లం పచ్చడిలో కలపాలి. పోపులో మినప్పప్పు, శనగపపప్పు ఉపయోగించవచ్చు. వగరు మామిడి పిందెల పచ్చడి కావల్సినవి: మామిడి పిందెల తురుము – 2 కప్పులు (మామిడి పిందెలను కడిగి, తుడిచి, పై తొక్క తీసి తురమాలి); కారం – 2 టేబుల్ స్పూన్లు; ఆవపిండి – టేబుల్ స్పూన్; మెంతి పొడి – 1 1/2 టీ స్పూన్లు; ఉప్పు – 1 1/2 టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె – 4–5 టేబుల్ స్పూన్లు పోపుకోసం: ఆవాలు – టీ స్పూన్; మినపగుండ్లు – టీ స్పూన్; శనగపప్పు – టేబుల్ స్పూన్; మెంతులు – కొద్దిగా; ఎండుమిర్చి – 2; ఇంగువ – పావు టీ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – అర టేబుల్ స్పూన్ తయారీ: పోపుకోసం ఇచ్చినవి మినహా పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక అందులో పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. ఈ పోపును మామిడి తురుము మిశ్రమంలో వేయాలి. బాగా కలిపి, పొడిగా ఉండే జార్లో పెట్టాలి. తడి లేని స్పూన్ని ఉపయోగించి ఈ పచ్చడి వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వగరు, కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయ పచ్చడి మాంచి రుచిగా ఉంటుంది. ఇంగువ రుచి నచ్చితేనే పోపులో వాడచ్చు. కారం పండు మిరపకాయ పచ్చడి కావల్సినవి: పండుమిరపకాయలు – 250 గ్రాములు; కొత్త చింతపండు – పెద్ద నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; మెంతులు – టేబుల్ స్పూన్ పోపుకోసం: మెంతులు – పావుటీస్పూన్; ఆవాలు – పావు టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; నూనె – 5 టేబుల్ స్పూన్లు తయారీ: మిరపకాయలను శుభ్రంగా కడగాలి. తర్వాత పొడిక్లాత్‌తో తడి లేకుండా తుడవాలి. మిగిలిన తేమ ఆరిపోయేలా నీడన మరో 4 గంటలు ఆరబెట్టాలి. తొడిమెలు తీసేయాలి. తర్వాత ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను తడిలేని మిక్సీ జార్లో వేసి రుబ్బాలి. కచ్చాపచ్చాగా రుబ్బాక ఈ మిశ్రమాన్ని తడిలేని గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం మధ్యలో చింతపండు పెట్టి, పైనంతా మిరపపండు మిశ్రమం కప్పేయాలి. పైన మూతపెట్టి 2 రోజులు కదపకుండా ఉంచాలి. మూడవ రోజున మిరపపండు మిశ్రమం నుంచి చింతపండును స్పూన్‌తో తీయాలి. ఈ చింతపండును మెత్తగా రుబ్బాలి. దీంట్లో మిరపపండు మిశ్రమం వేసి మళ్లీ రుబ్బాలి. పూర్తిగా చింతపండు, మిరపగుజ్జు కలిసిపోయేలా రుబ్బి, మెంతిపిండి కలపాలి. కడాయిలో నూనె వేడి చేసి, పోపు దినుసులన్నీ వేసి, కలిపి ఈ మిశ్రమాన్ని పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. ఉగాది పచ్చడి కావల్సినవి: నీళ్లు–1 1/2 కప్పులు మామిడికాయ తరుగు లేదా ముక్కలు–2 టేబుల్ స్పూన్లు వేప పువ్వు రేకలు–టేబుల్ స్పూన్ ఉప్పు–తగినంత బెల్లం తరుగు–3 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – చిటికెడు చింతపండు గుజ్జు – టీ స్పూన్ తయారీ: అర కప్పు నీళ్లను వేడి చే సి అందులో శుభ్రం చేసిన చింతపండును నానబెట్టాలి. వేపపువ్వును పల్చటి క్లాత్ మీద వేసి, క్లాత్‌తోనే మృదువుగా రుద్ది, వేప పువ్వు రేకలను మాత్రమే తీసుకోవాలి. కప్పు నీళ్లలో బెల్లం తరుగు వేసి బాగా కలపాలి. పూర్తిగా బెల్లం కరిగాక వడకట్టాలి. బెల్లం నీళ్లలో చింతపండు రసంతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి కలపాలి. ముందే రుచి చూడకూడదు. ఉగాది పచ్చడి ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి, కుటుంబసభ్యులందరితో కలిసి సేవించాలి. ఈ పచ్చడిలో సోంపు లేదా జీలకర్ర, అరటిపండు ముక్కలు, వేయించిన పుట్నాలపప్పు, జీడిపప్పు పలుకులు. కిస్మిస్ కలుపుకోవచ్చు. పులుపు చింత చిగురు పచ్చడి కావల్సినవి:చింతచిగురు – 2 కప్పులు; వెల్లుల్లి – 3 రెబ్బలు పచ్చిమిర్చి – 4; చింతపండు గుజ్జు – టేబుల్ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్; ఎండుమిర్చి – 5; ఆవాలు – టీ స్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత మినప్పప్పు – అర టీ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు తయారీ :కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో చింతచిగురు, ఉప్పు వేసి పది నిమిషాలు వేయించి మంట తీసేయాలి. మరో మూకుడు పొయ్యిమీద పెట్టి నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. చల్లారిన చింతచిగురు మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి, గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పోపు మిశ్రమాన్ని కలపాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. ఉప్పు ఉప్పు గోంగూర కావల్సినవి:గోంగూర – అర కేజీ ఉప్పు – 50 గ్రాములు (తగినంత) పసుపు – పావు టీ స్పూన్ తయారీ: గోంగూర ఆకులను తడి క్లాత్‌తో తుడిచి, ఆరబెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి గోంగూరను వేయించి, చల్లారనివ్వాలి. దీంట్లో పసుపు, ఉప్పు కలిపి జాడీలో నొక్కిపెట్టి, నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో పోపు పెట్టి అన్నంలో వడ్డించాలి. చేదు వేపపువ్వు పచ్చడి కావల్సినవి: వేపపువ్వు – కప్పు; ఎండుమిర్చి – 2 చింతపండు గుజ్జు – టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత\ నూనె – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు జీలకర్ర – అర టీ స్పూన్; నెయ్యి – అర టీ స్పూన్ బెల్లం తరుగు – పావు టీ స్పూన్ తయారీ: వేపపువ్వును శుభ్రం చేసి పక్కనుంచాలి. కడాయి స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి, వేడి కాగానే మంట తీసేయాలి. ఈ వేడి నెయ్యిలో వేప పువ్వు వేసి అటూ ఇటూ కలిపి ఒక గిన్నెలోకి తీసి ఉంచాలి. అదే కడాయిని వేడి చేసి, నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. చల్లారాక మిక్సీ జార్లో వీటితోపాటు చింతపండు గుజ్జు, జీలకర్ర, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా రుబ్బాలి. చివరగా వేప పువ్వును చేర్చి ఒకసారి బ్లెండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో పాటు వేపపువ్వు పచ్చడిని వడ్డించాలి. – నిర్వహణ: ఎన్.ఆర్