ఆ'రు'చుల పచ్చడి | ugadi festival special | Sakshi
Sakshi News home page

ఆ'రు'చుల పచ్చడి

Published Tue, Mar 28 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

ఆ'రు'చుల పచ్చడి

ఆ'రు'చుల పచ్చడి

ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ప్రతి రుచికి ఒక ప్రత్యేకత... అసలు ప్రతి రుచీ ఒక పచ్చడే!
ఆ రుచి తీపి
ఆ రుచి వగరు
ఆ రుచి కారం
ఆ రుచి పులుపు
ఆ రుచి ఉప్పు
ఆ రుచి చేదు
ఆ రుచుల పచ్చళ్లు
ఉగాదికి రుచి పచ్చళ్లు.


తీపి
బెల్లం పచ్చడి
కావల్సినవి: బెల్లం – 100 గ్రాములు (తీపి ఇష్టపడేవారు మరికాస్త వేసుకోవచ్చు) అల్లం – 250 గ్రాములు (పావు కేజీ); పసుపు – పావు టీ స్పూన్‌; చింతపండు – 100 గ్రాములు; కారం – 6 టేబుల్‌ స్పూన్లు (కడాయిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి, ఎండుమిర్చి వేయించి, పొడి చేసినది); ఉప్పు – తగినంత; మెంతులు – టేబుల్‌ స్పూన్‌ (వేయించి, పొడి చేయాలి)

పోపు: కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – టీ స్పూన్‌; నూనె – 100 గ్రాములు. ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 10 రెబ్బలు; ఇంగువ – చిటికెడు
తయారీ: అల్లంపై ఉన్న మట్టి అంతా పోయేలా కడగాలి. తర్వాత పొట్టు తీసి, నీళ్లన్నీ ఆరిపోయేలా పైన ఒక క్లాత్‌ కప్పి, రాత్రంతా అలాగే ఉంచేయాలి. అల్లం సన్నగా తరగాలి. అరకప్పు నీళ్లు వేడిచేసి దాంట్లో చింతపండు నానబెట్టాలి. పొయ్యి మీద కడాయి పెట్టి టీ స్పూన్‌ నూనె వేసి సన్నని మంట మీద అల్లం 3–4 నిమిషాలు వేయించి, చల్లారనివ్వాలి. మిక్సర్‌లో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసి, కారం, పసుపు అల్లంలో వేసి మెత్తగా రుబ్బాలి. దీంట్లో బెల్లం వేసి, రుబ్బి, మెంతి పొడి కలపాలి. మూకుడులో నూనె పోసి పోపు దినుసులన్నీ వేసి, వేయించి ఈ మిశ్రమాన్ని అల్లం పచ్చడిలో కలపాలి. పోపులో మినప్పప్పు, శనగపపప్పు ఉపయోగించవచ్చు.

వగరు
మామిడి పిందెల పచ్చడి

కావల్సినవి: మామిడి పిందెల తురుము – 2 కప్పులు (మామిడి పిందెలను కడిగి, తుడిచి, పై తొక్క తీసి తురమాలి); కారం – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవపిండి – టేబుల్‌ స్పూన్‌; మెంతి పొడి – 1 1/2 టీ స్పూన్లు; ఉప్పు –  1 1/2 టేబుల్‌ స్పూన్లు; నువ్వుల నూనె – 4–5 టేబుల్‌ స్పూన్లు

పోపుకోసం: ఆవాలు – టీ స్పూన్‌; మినపగుండ్లు – టీ స్పూన్‌; శనగపప్పు – టేబుల్‌ స్పూన్‌; మెంతులు – కొద్దిగా; ఎండుమిర్చి – 2; ఇంగువ – పావు టీ స్పూన్‌ కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – అర టేబుల్‌ స్పూన్‌

తయారీ: పోపుకోసం ఇచ్చినవి మినహా పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక అందులో పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. ఈ పోపును మామిడి తురుము  మిశ్రమంలో వేయాలి. బాగా కలిపి, పొడిగా ఉండే జార్‌లో పెట్టాలి. తడి లేని స్పూన్‌ని ఉపయోగించి ఈ పచ్చడి వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వగరు, కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయ పచ్చడి మాంచి రుచిగా ఉంటుంది. ఇంగువ రుచి నచ్చితేనే పోపులో వాడచ్చు.

కారం
పండు మిరపకాయ  పచ్చడి
కావల్సినవి: పండుమిరపకాయలు – 250 గ్రాములు; కొత్త చింతపండు – పెద్ద నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; మెంతులు – టేబుల్‌ స్పూన్‌

పోపుకోసం: మెంతులు – పావుటీస్పూన్‌; ఆవాలు – పావు టీ స్పూన్‌; ఇంగువ – చిటికెడు; నూనె – 5 టేబుల్‌ స్పూన్లు

తయారీ: మిరపకాయలను శుభ్రంగా కడగాలి. తర్వాత పొడిక్లాత్‌తో తడి లేకుండా తుడవాలి. మిగిలిన తేమ ఆరిపోయేలా నీడన మరో 4 గంటలు ఆరబెట్టాలి. తొడిమెలు తీసేయాలి. తర్వాత ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను తడిలేని మిక్సీ జార్‌లో వేసి రుబ్బాలి. కచ్చాపచ్చాగా రుబ్బాక ఈ మిశ్రమాన్ని తడిలేని గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం మధ్యలో చింతపండు పెట్టి, పైనంతా మిరపపండు మిశ్రమం కప్పేయాలి. పైన మూతపెట్టి 2 రోజులు కదపకుండా ఉంచాలి. మూడవ రోజున మిరపపండు మిశ్రమం నుంచి చింతపండును స్పూన్‌తో తీయాలి. ఈ చింతపండును మెత్తగా రుబ్బాలి. దీంట్లో మిరపపండు మిశ్రమం వేసి మళ్లీ రుబ్బాలి. పూర్తిగా చింతపండు, మిరపగుజ్జు కలిసిపోయేలా రుబ్బి, మెంతిపిండి కలపాలి. కడాయిలో నూనె వేడి చేసి, పోపు దినుసులన్నీ వేసి, కలిపి ఈ మిశ్రమాన్ని పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.

ఉగాది పచ్చడి
కావల్సినవి: నీళ్లు–1 1/2 కప్పులు మామిడికాయ తరుగు లేదా ముక్కలు–2 టేబుల్‌ స్పూన్లు వేప పువ్వు రేకలు–టేబుల్‌ స్పూన్‌
ఉప్పు–తగినంత బెల్లం తరుగు–3 టేబుల్‌ స్పూన్లు మిరియాల పొడి – చిటికెడు చింతపండు గుజ్జు – టీ స్పూన్‌

తయారీ: అర కప్పు నీళ్లను వేడి చే సి అందులో శుభ్రం చేసిన చింతపండును నానబెట్టాలి. వేపపువ్వును పల్చటి క్లాత్‌ మీద వేసి, క్లాత్‌తోనే మృదువుగా రుద్ది, వేప పువ్వు రేకలను మాత్రమే తీసుకోవాలి. కప్పు నీళ్లలో బెల్లం తరుగు వేసి బాగా కలపాలి. పూర్తిగా బెల్లం కరిగాక వడకట్టాలి. బెల్లం నీళ్లలో చింతపండు రసంతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి కలపాలి. ముందే రుచి చూడకూడదు. ఉగాది పచ్చడి ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టి, కుటుంబసభ్యులందరితో కలిసి సేవించాలి. ఈ పచ్చడిలో సోంపు లేదా జీలకర్ర, అరటిపండు ముక్కలు, వేయించిన పుట్నాలపప్పు, జీడిపప్పు పలుకులు. కిస్‌మిస్‌ కలుపుకోవచ్చు.

పులుపు
చింత చిగురు పచ్చడి
కావల్సినవి:చింతచిగురు – 2 కప్పులు; వెల్లుల్లి – 3 రెబ్బలు పచ్చిమిర్చి – 4; చింతపండు గుజ్జు – టేబుల్‌ స్పూన్‌; మెంతులు – పావు టీ స్పూన్‌; ఎండుమిర్చి – 5; ఆవాలు – టీ స్పూన్‌; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత మినప్పప్పు – అర టీ స్పూన్‌ కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ :కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో చింతచిగురు, ఉప్పు వేసి పది నిమిషాలు వేయించి మంట తీసేయాలి. మరో మూకుడు పొయ్యిమీద పెట్టి నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. చల్లారిన చింతచిగురు మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి, గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పోపు మిశ్రమాన్ని కలపాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.

ఉప్పు
ఉప్పు గోంగూర
కావల్సినవి:గోంగూర – అర కేజీ ఉప్పు – 50 గ్రాములు (తగినంత) పసుపు – పావు టీ స్పూన్‌

తయారీ: గోంగూర ఆకులను తడి క్లాత్‌తో తుడిచి, ఆరబెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి గోంగూరను వేయించి, చల్లారనివ్వాలి. దీంట్లో పసుపు, ఉప్పు కలిపి జాడీలో నొక్కిపెట్టి, నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో పోపు పెట్టి అన్నంలో వడ్డించాలి.

చేదు
వేపపువ్వు పచ్చడి
కావల్సినవి: వేపపువ్వు – కప్పు; ఎండుమిర్చి – 2 చింతపండు గుజ్జు – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత\ నూనె – టీ స్పూన్‌; కరివేపాకు – 2 రెమ్మలు జీలకర్ర – అర టీ స్పూన్‌; నెయ్యి – అర టీ స్పూన్‌ బెల్లం తరుగు – పావు టీ స్పూన్‌

తయారీ: వేపపువ్వును శుభ్రం చేసి పక్కనుంచాలి. కడాయి స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి, వేడి కాగానే మంట తీసేయాలి. ఈ వేడి నెయ్యిలో వేప పువ్వు వేసి అటూ ఇటూ కలిపి ఒక గిన్నెలోకి తీసి ఉంచాలి. అదే కడాయిని వేడి చేసి, నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. చల్లారాక మిక్సీ జార్‌లో వీటితోపాటు చింతపండు గుజ్జు, జీలకర్ర, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా రుబ్బాలి. చివరగా వేప పువ్వును చేర్చి ఒకసారి బ్లెండ్‌ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో పాటు వేపపువ్వు పచ్చడిని వడ్డించాలి.
– నిర్వహణ: ఎన్‌.ఆర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement