ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరం
- రక్షణ లేని ‘చదువు’
- పాఠశాల భవనాలలో సౌకర్యాలు కరువు
- దుర్వినియోగమవుతున్న నిధులు
- విద్యార్థులకు తప్పని తిప్పలు
- నామమాత్రంగా మారిన నిర్వహణ కమిటీలు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకరంగా మారాయి. అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి ఏటా కోట్లాది రూపాయలు మంజూరవుతు న్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు రావడం లేదు. ఫలితంగా ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్ని మండలం రుద్రూర్ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి చాకలి శ్రీను పాము కాటుతో మృతి చెందడం ఇందుకు నిదర్శనం.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇందు లో చదువుకుంటున్నారు. వారితోపాటు అక్కడ సమస్యలూ సహవాసం చేస్తున్నాయి. 211 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. మరికొన్ని పాఠశాలలు ఊరికి చివర గా ఉండడంతో, సరైన దారులు లేక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వానాకాలంలో చెట్లు, ముళ్లపొదలు పెరగడంతో పరిసరాలు పమాదకరంగా మారుతు న్నాయి. కాలినడక దారులు కనడబడకుండా పోతున్నాయి. పాఠశాలలలో కనీస సౌకర్యాల కల్పన కోసం రాజీవ్ విద్యా మిషన్ నుంచి కోట్లాది రూపాయలు విడుదలవుతున్నాయి.
కానీ, అది సక్రమంగా వినియోగం కావడం లేదు. ప్రజాప్రతినిధుల సహకారంతో, కొందరు కాంట్రాక్టర్లు అవసరం లేని చోట అదనపు గదులు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. అవసరం ఉన్న ప్రాంతాలలో ఈ పనులు కొనసాగడం లేదు. జిల్లాలోని 484 పాఠశాలల భవనాలు అసౌకర్యాలకు నిలయంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మిం చినవి కావడంతో దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పులకు రంధ్రాలు, తరగతి గదుల గోడలకు పగుళ్లు ఏర్పడినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం పడితే పరిస్థితి ప్రమాదకరమే. కొన్ని చోట్ల సరిపడినన్ని తరగతి గదులు లేక ఆరుబయటనే విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. మూత్రశాలలు నిర్మించి ఉన్న ప్రాంతం లో ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు.
మరి నిధులు ఏమవుతున్నాయి
పాఠశాల అభివృద్ధికి సంబంధించి (ఎస్ఎంసీ) పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కమిటీలో 23 మంది, ఉన్నత పాఠశాలల కమిటీలో 17 మంది సభ్యులు ఉంటారు. వీటికి ఏటా పాఠశాల నిధులు రూ. ఏడు వేలు, నిర్వహణ కోసం రూ. ఐదు వేలు, అలాగే 6,7 తరగతులకు మూడు గదుల కం టే ఎక్కువ ఉంటే పది వేల రూపాయలు మంజూరు అవుతాయి. వీటిని పాఠశాల అభివృద్ధికి, వివిధ మరమ్మతులు, పరిశుభ్రతకు వినియోగించాలి, ఎక్కడ కూడా ఈ నిధులకు సక్రమంగా వినియోగించడం లేదు. ఫలితంగా పాఠశాలల పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ముళ్లపొదల మధ్య, బురదనీటితో కునారిల్లుతున్నాయి.