Rulers Bias
-
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు ?
సాక్షి, కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తున్నారని, మజీదులు, చర్చిల జోలికి వారు ఎందుకు పోవడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. హిందువుల గుడులు రాజకీయాలకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, మజీదులపై లేని పెత్తనం హిందూ దేవాలయాలపైనే ఎందుకన్నారు. ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని, పాలకవర్గాల వైఖరి కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే 80 ఏళ్లు దాటిన వారికి సాధ్యం కాదని, యువతే దానికి కారకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మాది అని భావించి స్వార్థం లేకుండా ముందుకు సాగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహానా మేధావులు భారతీయ సంస్కతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారినుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఎస్ రెడ్కో ఎండీ.సుధాకర్‌రావు, సురభి రాజు బాలాదిత్య లక్ష్మారావులు కూడా ప్రసంగించారు. -
వానొస్తే..బురదే!
- రోడ్లు ఎరుగని 17వ వార్డు - వర్షం కురిస్తే చాలు.. కాలనీ అంతా ఏరులై పారుతున్న మురుగు - కంపువాసన భరించలేకపోతున్న కాలనీవాసులు సంగారెడ్డి మున్సిపాలిటీ: అభివృద్ధి అంటే ఈ వార్డుకు తెలియదు. పాలకులు హామీలిచ్చారు. నిధులు సైతం మంజూరయినా.. అధికారుల నిర్లక్ష్యం పాలకుల పక్షపాతం కారణంగా పనులు ప్రారంభం కాలేకపోతున్నాయి. పట్టణంలోని17వ వార్డులో గల మగ్దూంనగర్, సంతోష్‌నగర్‌తో పాటు మరో రెండు కాలనీలు మురికి కాల్వలు లేక ఎక్కడికక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం ఈ వార్డులో ఇంత వరకు ఫార్మేషన్ రోడ్లు కూడా నిర్మించలేదు. దీంతో వర్షకాలం వస్తే చాలు.. కాలనీ వాసులు మోకాళ్లలోతు బురదలో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వార్డులో వర్షం కురిస్తే చాలు ఆ కాలనీ నుంచి బయటకు వచ్చేందుకే వృద్ధులు భయపడుతున్నారు. ఇక్కడ ఎక్కువగా పోలీసుశాఖలో పని చేసే వారే ఉండటంతో అధికారులకు.. నాయకులకు అడిగే పరిస్థితి లేకపోవడంతో ఈ కాల నీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ కాలనీలో ఎటు చూసినా వరద నీటితో పాటు మురుగు చేరుతోంది. ఈ ప్రాంతంలో మురికి కాల్వలున్నా వాటిని శుభ్రం చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల మురికి కాల్వలు లేకపోవడం తో సొంత డబ్బులతో పైప్‌లైన్ వేసుకొని నీటిని తరలిస్తున్నారు. ప్రధానంగా ఈ కాలనీ లో డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడికక్కడ మురుగు నిల్వఉండటంతో దుర్గంధం వెదజల్లుతుంది. మరోవైపు కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ప్రెసిడెంట్ ఫంక్షన్ హాల్, స్టూడెంట్ ఇస్లామిక్ కార్యాలయం, మెదడిస్ట్ చర్చ్ మార్గాలలో రోడ్లు లేక ఆ ప్రాంత వాసు లు బురదలోనుంచే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ అభివృద్ధి పనులు చేశాం.. రూ.34 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. మరో రూ.25 లక్షలు మంజూరై నిధులు సిద్ధంగా ఉన్నాయి. రూ.4 లక్షలతో సీసీ డ్రైన్, మరో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో మొరం రోడ్డు వేశాం. రూ.3 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ కోసం రూ.25 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించక జాప్యం జరుగుతోంది. - సమీనా, కౌన్సిలర్ అభివృద్దికి పాటుపడతాం.. పట్టణంలోని అన్ని వార్డులను సమాంతరంగా అభివృద్ధి చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే తాము ముదంజలో ఉన్నాం. వరద కాల్వ నిర్మాణం చేశాం. 17వ వార్డులో ఇప్పటికే రూ.34 లక్షల పనులు చేశాం. మరో రూ.35 నుంచి రూ.40 లక్షల విలువ చేసే పనులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామనడానికి వార్డు అభివృద్ధే నిదర్శనం. - బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్‌చైర్ పర్సన్