![why rulers shows interest on Hindu Temples? - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/12/paripoornannada.jpg.webp?itok=TYeVFhEJ)
సాక్షి, కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తున్నారని, మజీదులు, చర్చిల జోలికి వారు ఎందుకు పోవడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. హిందువుల గుడులు రాజకీయాలకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, మజీదులపై లేని పెత్తనం హిందూ దేవాలయాలపైనే ఎందుకన్నారు. ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని, పాలకవర్గాల వైఖరి కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
మా దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే 80 ఏళ్లు దాటిన వారికి సాధ్యం కాదని, యువతే దానికి కారకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మాది అని భావించి స్వార్థం లేకుండా ముందుకు సాగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహానా మేధావులు భారతీయ సంస్కతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారినుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఎస్ రెడ్‌కో ఎండీ.సుధాకర్‌రావు, సురభి రాజు బాలాదిత్య లక్ష్మారావులు కూడా ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment