Running Shaadi.Com
-
ఎక్కడ తగ్గాలో... ఎక్కడ తగ్గకూడదో నాకు తెలుసు!
గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న తాప్సీ, ఇటీవల తన మకాం ముంబయ్‌కి మార్చేసిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమపై అలకతోనే ఈ ఢిల్లీ బ్యూటీ ఇలా చేశారా? అనే సందేహం కొంతమందికి లేకపోలేదు. అయితే, అలాంటిదేం లేదని తాప్సీ అంటున్నారు. తెలుగులో కావల్సినంత గుర్తింపు వచ్చింది కాబట్టి, తనెక్కడున్నా ఇక్కడి దర్శక, నిర్మాతలు పిలిచి అవకాశాలిస్తారనే నమ్మకం ఉంది తాప్సీకి. కానీ, బాలీవుడ్‌కి కొత్త కాబట్టి, అక్కడి వారికి దగ్గరగా ఉండకపోతే అవకాశాలు రావడం కష్టమన్నది ఆమె ఆలోచన. అందుకే ముంబయ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హిందీలో తాప్సీ నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హిందీ చిత్రాల అవకాశాల కోసమే ముంబయ్‌లో ఉంటున్నప్పటికీ, తెలుగు చిత్రాలను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తాప్సీ స్పష్టం చేశారు. మంచి సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, ఒకవేళ పాత్ర బాగా నచ్చితే, పారితోషికం తగ్గించుకుంటానని కూడా చెప్పారు. గతంలో ఓ సినిమాకి అలా చేశానని పేర్కొన్నారు తాప్సీ. పారితోషికం ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో తనకు బాగా తెలుసని కూడా అన్నారు తాప్సీ. ఎలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటారు? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే.. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అంటారే.. అలా, పారితోషికం తగ్గించుకున్నా, నటిగా ఆత్మసంతృప్తి మిగిలిందనిపించే పాత్రలకు తాను సిద్ధం అన్నారు. -
బహిరంగ చుంబనం..!
అమిత్ సాద్, తాప్సీ.. ప్రస్తుతం ముంబయ్‌లో ఎక్కడ చూసినా ఈ జంటే. కలిసి ప్రేమికుల దినోత్సవం జరుపుకున్నారు. అది కూడా ముంబయ్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో. అక్కడి విద్యార్థులతో కలిసి ఈ ఇద్దరూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక, ఇటీవల ఈ ఇద్దరూ ఓ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం పూర్తవగానే అమిత్, తాప్సీ ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు కావల్సినన్ని పోజులిచ్చారు. కానీ, అడగని పోజు కూడా ఒకటిచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్న సమయంలో తాప్సీ బుగ్గ మీద అమిత్ ఓ ముద్దిచ్చుకున్నారు. ఇలాంటి సీన్లను కెమెరా కన్నులు అస్సలు మిస్ కావు. చకచకా తమ కెమెరాలకు పని చెప్పారు. పబ్లిక్‌లో ఇలా చేస్తావా? అని అమిత్ చెంప చెళ్లుమనిపించకుండా తాప్సీ హాయిగా నవ్వేసుకున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ ఉందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ‘రన్నింగ్ షాదీ.కామ్’ అనే హిందీ చిత్రంలో ఇద్దరూ జంటగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాలేజీ స్టూడెంట్స్‌ని ప్రేమికుల దినోత్సవం నాడు కలిశారు. అలాగే, ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఇవాళా రేపూ ఓ సినిమాకి కావల్సినంత ప్రచారం రావాలంటే రకరకాల జిమ్మిక్కులు చేయాలి. అందుకే, అమిత్ ఈ బహిరంగ చుంబన కేళీకి రెడీ అయ్యుంటారేమో. -
ఆ ఒక్కరోజు మాత్రం లవర్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది!
నాన్‌స్టాప్‌గా పని చేసినప్పుడు కొంత రిలాక్స్ అయితే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. ఇటీవల తాప్సీకి అలానే అనిపించింది. హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ కోసం 45 రోజుల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొన్నారామె. అందుకని ఐదు రోజులు బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. ఈరోజుతో ఆ బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టి, ‘ముని 3’ చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నారు. సినిమాల సంగతి అలా ఉంచితే.. తాప్సీ లవ్‌లైఫ్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు తను అస్సలు ప్రేమలో పడలేదట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ -‘‘ఇప్పుడున్నంత అందంగా అప్పట్లో నేను ఉండేదాన్ని కాదు. అందుకే ఐ లవ్ యు చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. ఇప్పుడు నేను అందంగా ఉన్నా ఎవరూ ఐ లవ్ యు చెప్పడంలేదు. దానికి కారణం ఇప్పుడు నేను స్టార్‌ని. చెంపలు వాయించేస్తానని భయపడుతున్నారేమో. అయినా ఈ సింగిల్ లైఫ్ బాగానే ఉంది. కానీ, ప్రేమికుల దినోత్సవం నాడు మాత్రం మనకు లవర్ ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే, ప్రేమికులందరూ బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం, ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు కబుర్లు చెప్పుకోవడం చూస్తే భలే అనిపిస్తుంది’’ అని చెప్పారు.