ఎక్కడ తగ్గాలో... ఎక్కడ తగ్గకూడదో నాకు తెలుసు!
గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న తాప్సీ, ఇటీవల తన మకాం ముంబయ్‌కి మార్చేసిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమపై అలకతోనే ఈ ఢిల్లీ బ్యూటీ ఇలా చేశారా? అనే సందేహం కొంతమందికి లేకపోలేదు. అయితే, అలాంటిదేం లేదని తాప్సీ అంటున్నారు. తెలుగులో కావల్సినంత గుర్తింపు వచ్చింది కాబట్టి, తనెక్కడున్నా ఇక్కడి దర్శక, నిర్మాతలు పిలిచి అవకాశాలిస్తారనే నమ్మకం ఉంది తాప్సీకి. కానీ, బాలీవుడ్‌కి కొత్త కాబట్టి, అక్కడి వారికి దగ్గరగా ఉండకపోతే అవకాశాలు రావడం కష్టమన్నది ఆమె ఆలోచన. అందుకే ముంబయ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం హిందీలో తాప్సీ నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హిందీ చిత్రాల అవకాశాల కోసమే ముంబయ్‌లో ఉంటున్నప్పటికీ, తెలుగు చిత్రాలను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తాప్సీ స్పష్టం చేశారు. మంచి సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, ఒకవేళ పాత్ర బాగా నచ్చితే, పారితోషికం తగ్గించుకుంటానని కూడా చెప్పారు. గతంలో ఓ సినిమాకి అలా చేశానని పేర్కొన్నారు తాప్సీ. పారితోషికం ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో తనకు బాగా తెలుసని కూడా అన్నారు తాప్సీ. ఎలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటారు? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే.. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అంటారే.. అలా, పారితోషికం తగ్గించుకున్నా, నటిగా ఆత్మసంతృప్తి మిగిలిందనిపించే పాత్రలకు తాను సిద్ధం అన్నారు.