రూపాయికి జోష్!
ముంబై: రూపాయి వరుసగా నాలుగో రోజూ కదంతొక్కింది. సిరియా పై అమెరికా దాడుల భయాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు కొద్దిగా శాంతించడం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 140 పైసలు దూసుకెళ్లి 63.84 వద్ద స్థిరపడింది. గడచిన రెండు వారాల్లో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ఆగస్టు 29న రూపాయి 225 పైసలు ఎగబాకింది. మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే. కాగా, భారత్ ఎగుమతులు ఆగస్టులో దాదాపు 13 శాతం ఎగబాకడం,
వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం కూడా దేశీ కరెన్సీకి చేయూతనిచ్చినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఆసరాతో దేశీ స్టాక్ మార్కెట్ కూడా వరుసగా నాలుగోరోజూ పరుగులు తీసింది. సెన్సెక్స్ మంగళవారం 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. దేశీ మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ జోరందుకుంటుందన్న అంచనాలతో అటు బ్యాంకులు, ఇటు ఎగుమతిదార్లు డాలర్ పొజిషన్లను తగ్గించుకోడంపై దృష్టిపెట్టినట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ 379 పైసలు(5.6 శాతం) ఎగబాకడం గమనార్హం.