Rupee note
-
23 ఏళ్ల తర్వాత రూపాయి నోటు
సాక్షి, చెన్నై: 23 సంవత్సరాల తర్వాత తమిళనాడులో కొత్తగా ఒక రూపాయి కరెన్సీ నోటు చలామణిలోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో చేపట్టిన కరెన్సీ నోట్ల రద్దు తరువాత కొత్తగా రూ. 2 వేలు, రూ. 500, రూ. 200, రూ.50, రూ.10 ల కొత్త కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఈ నోట్లు అన్నీ కొత్త రూపాల్లో పలు రంగుల్లో ముద్రితమయ్యాయి. రూ.10 నోటు, దీనిపైబడి విలువ కలిగిన నోట్లను రిజర్వు బ్యాంకు అచ్చు వేస్తుంది. ఈ కరెన్సీ పై రిజర్వుబ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ రూపాయి నోటును మాత్రం భారత ప్రభుత్వమే స్వయంగా విడుదల చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ క్రమంలో కొత్తగా విడుదల చేసిన రూపాయి నోటుపై కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ముద్రితమై ఉంటుంది. ఈ నోటు వెనుక భాగంలో కరెన్సీ ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ఈ రూపాయి నోటు అచ్చు వేయడం 1994 లో నిలిపి వేశారు. తిరిగి 23 ఏళ్ల తరువాత మళ్లీ రూపాయి నోట్లు చలామణిలోకి వచ్చాయి. -
రూపాయి @ రూ.1.14
న్యూఢిల్లీ: 20 ఏళ్లుగా మనకు కనిపించకుండాపోయిన రూపాయి నోటు మళ్లీ మన పర్సులోకి వచ్చింది. దీనిని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఆ నోటు విలువ కంటే ఎక్కువే వ్యయమవుతుంది! రూపాయి నోటు ముద్రణకు అక్షరాలా రూపాయి 14 పైసలు ఖర్చవుతుంది. ఈ ఆసక్తికరమైన విషయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) ఈ విషయాన్ని వెల్లడించింది. రూపాయి నోటు ముద్రణకు కాస్టింగ్ సూత్రం ప్రకారం రూ.1.14 ఖర్చవుతుందని ప్రాథమికంగా లెక్కగట్టామని, పూర్తిస్థాయిలో ఆడిటింగ్ జరిగితే కచ్చితమైన విలువ తెలుస్తుందని పేర్కొంది. 2014-15కు సంబంధించి ఇంకా ఆడిటింగ్ పనులు జరుగుతున్నాయంది. ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ దాఖలు చేసిన దరఖాస్తుకు ఎస్పీఎంసీఐఎల్ ఈమేరకు వెల్లడించింది. రూపాయి నోటు ముద్రణకు ఎక్కువ ఖర్చవుతోందని, అదీగాక ఇది ఎక్కువ కాలం మనుగడలో ఉండదనే కారణంతో దీని ముద్రణను 1994లో నిలిపేశారు. ఈ కారణంతో రెండు, ఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను కూడా ఆపేసి బిళ్లల రూపంలో తీసుకొచ్చారని అగర్వాల్ చెప్పారు. అయితే రూపాయి నోట్లను మళ్లీ ప్రింట్ చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2014 డిసెంబర్ 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. గత మార్చి 6న రాజస్తాన్‌లోని శ్రీనాథ్జీ ఆలయంలో ఈ నోటును విడుదల చేసింది. అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే,రూపాయి నోటుపై మాత్రం ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉండటం దీని ప్రత్యేకత.