కరెన్సీ క్రాష్ 65 దాటేసిన దేశీ కరెన్సీ
ముంబై: పాతాళం వైపు పరుగులు తీస్తున్న రూపాయి మారకం విలువ వరుసగా ఆరో సెషన్లో కూడా క్షీణించింది. గురువారం డాలర్‌తో పోలిస్తే ఒకదశలో చారిత్రకమైన 65 స్థాయిని కూడా దాటేసింది. చివరికి మాత్రం కోలుకున్నప్పటికీ 44 పైసల నష్టంతో మరో ఆల్‌టైమ్ కనిష్టమైన 64.55 వద్ద ముగిసింది. దేశీ స్టాక్‌మార్కెట్లు రికవర్ అయినప్పటికీ.. విదేశీ నిధులు తరలిపోవడం కొనసాగడంతో రూపాయి పతనం తప్పలేదు. దీంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలో రూపాయి విలువ 336 పైసల మేర (5.49 శాతం) పడిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్లపై ఆందోళనలను తగ్గించే దిశగా.. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సిన అవసరమేమీ లేదని,
పరిస్థితులు చక్కబడగలవని ఆర్థిక మంత్రి పి.చిదంబరం భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఫారెక్స్ మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూపాయి విలువ స్థిరపడ్డాకా .. ఇటీవల తీసుకుంటున్న చర్యలను ఉపసంహరిస్తామని చిదంబరం తెలిపారు.గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.11తో పోలిస్తే బలహీనంగా 64.85 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అటుపైన చారిత్రకమైన 65 మార్కును దాటేసి ఏకంగా 65.56 స్థాయినీ తాకింది. కానీ చివరికి మాత్రం 0.69 శాతం మేర నష్టంతో 64.55 వద్ద ముగిసింది.
ఫలితమివ్వని ఆర్బీఐ, కేంద్రం చర్యలు..
ఆర్బీఐ, కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రూపాయిని పతనం నుంచి కాపాడలేకపోతున్నాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరించడానికి కట్టుబడి ఉందన్న సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయంగా డాలరు మరింత బలపడింది. ఇది రూపాయిపై ఒత్తిడి మరింత పెంచింది. ఫెడరల్ రిజర్వ్ చర్యలపై ఆందోళనలతో ఇండొనే సియా, మలేసియా, థాయ్‌లాండ్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలు సైతం కొత్త కనిష్టాలను తాకాయి. ప్రస్తుతం.. రూపాయి ట్రేడింగ్ శ్రేణి 64.10-65.10 మధ్యలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.