రూ.18.43 కోట్లతో రోడ్ల అభివృద్ధి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: కోవూరు నియోజకవర్గంలోని వివిధ రోడ్ల అభివృద్ధికి రూరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.18.43 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. కోవూరు ఇనమడుగు సెంటర్ నుంచి ముదివర్తి వరకు (1/0 నుంచి 16/0 వరకు) రూ.13.35 కోట్లతో రోడ్డు వెడల్పుతో పాటు తారురోడ్డు నిర్మాణం జరగనుందన్నారు.
నెల్లూరు మైపాడు రోడ్డు నుంచి కుడితిపాళెం వరకు (కి.మీ. 16/0 నుంచి 27/4 వరకు), ఇందుకూరుపేట లూప్ రోడ్డు నుంచి పోట్లపూడి వరకు (కి.మీ 0/0 నుంచి 3/0 వరకు) రెండు రోడ్ల అభివృద్ధికి రూ.1.90 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి దగదర్తి వరకు (కి.మీ 13/5 నుంచి 21/0 వరకు) రోడ్ల అభివృద్ధికి రూ.1.83 లక్షల నిధులు కేటాయించారన్నారు.
ఎంసీ రోడ్డు నుంచి ఎంసీ రోడ్డు వరకు వయా గండవరం, పెద్దపుత్తేడు, చవటపుత్తేడు, ఊచగుంటపాళెం వరకు ( కి.మీ. 7/4 నుంచి 16/4 వరకు) రూ.1.35 లక్షలు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు. రోడ్ల మంజూరుకు సహకరించిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.