rural hospitals
-
పల్లె దవాఖానాలకు 1,492 మంది వైద్యులు
సాక్షి, హైదరాబాద్: పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను (మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు) కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, అందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో 1,569 పోస్టులను ఇప్పటికే భర్తీ చేయగా, ఇప్పుడు కొత్తగా మరిన్ని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి గ్రామీణ ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల్లోనే వైద్య సేవలు అందించనున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్దాసుపత్రులకు వెళ్లడం తప్ప, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ జబ్బులకు ఇక పల్లె దవాఖానాల్లోనే చికిత్స చేస్తారు. ఈ దవాఖానాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ కూడా సేకరిస్తారు. వాటిని టీ–డయాగ్నస్టిక్స్‌కు పంపుతారు. అక్కడి నుండి వచ్చిన ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తారు. కాగా, ప్రాథమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా.. రోగులకు వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్‌సీ లేదా ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో వైద్య సేవలు అందించడానికి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 110 మంది.. పల్లె దవాఖానాల్లో తాజా నియామకాల్లో భాగంగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 110 మంది వైద్యులను నియమించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 21, భద్రాద్రి కొత్తగూడెంలో 69, హనుమకొండ 25, జగిత్యాల 47, జనగాం 38, జయశంకర్ భూపాలపల్లి 31, గద్వాల, కామారెడ్డి జిల్లాల్లో 34 మంది చొప్పున, కరీంనగర్ 41, ఆసిఫాబాద్ 26, ఖమ్మం 73, మహబూబాబాద్ 91, మహబూబ్‌నగర్ 57, మంచిర్యాల 60, మెదక్ 36, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 22, నాగర్‌కర్నూలు 52, నారాయణపేట 32, నిర్మల్ 39, నిజామాబాద్ 55, పెద్దపల్లి 31, రాజన్న సిరిసిల్ల 41, రంగారెడ్డి 50, సంగారెడ్డి 77, సిద్దిపేట 32, సూర్యాపేట 50, వికారాబాద్ 66, వనపర్తి 26, వరంగల్ 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో భర్తీ చేసిన పోస్టుల్లో ఆయుష్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి కూడా ఎంబీబీఎస్ డాక్టర్లకు బదులుగా వీరే ఎక్కువగా దరఖాస్తు చేసుకునే అవకాశముందని చెపుతున్నారు. -
పల్లె దవాఖానాల్లో 1,569 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లె దవాఖానాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. 969 పోస్టులకు మెరిట్ జాబితా ప్రకటించామని, వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. దీంతో అన్ని పీహెచ్‌సీల్లో డాక్టర్లు పూర్తిస్థాయిలో ఉంటారన్నారు. హరీశ్‌రావు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ‘పీహెచ్సీ మానిటరింగ్ హబ్’ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘పల్లె దవాఖానాల కోసం 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది.స్టాఫ్ నర్సులు, 1,165 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తాం. కేంద్రం దేశంలో వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇంకా కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా జిల్లాల్లో కొత్త కాలేజీలను కేంద్రం ఇప్పుడు అనుమతించినా తీసుకుంటాం. దీనికోసం స్వయంగా నేనే కేంద్రం వద్దకు పత్రాలు తీసుకొని వెళ్తాను. కేంద్రం రేపు రమ్మంటే రేపే వెళ్తాను. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి కూడా అభ్యంతరం లేదు. మరి ఆయన చొరవతీసుకుంటారా?’ అని అన్నారు. రాష్ట్రంలో 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయని, వీటిని 500కు పెంచాలని నిర్ణయించామన్నారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని చెప్పారు. వీటి వల్ల ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని తెలిపారు. ‘2019లో ఉస్మానియా ఆసుపత్రిలో 12 లక్షల ఓపీ ఉంటే.. ఈ ఏడాది 5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5 లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్‌లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్ ఆసుపత్రిలో 4 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ ఇతర సర్జరీల పెరిగాయి’ అని చెప్పారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న 4,500 ఆరోగ్య ఉపకేంద్రాలకుగాను 2,900 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. దేశంలో ఇదే తొలిసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన కార్యక్రమాలపై డిసెంబర్ చివరన ప్రగతి నివేదిక విడుదల చేస్తామని తెలిపారు. పీహెచ్సీ మానిటరింగ్ హబ్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటిసారని చెప్పారు. రాష్ట్రంలోని 887 పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీలకు అనుసంధానం చేశామన్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 43 పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో కొత్త భవనాలను మంజూరు చేశామన్నారు. 372 పీహెచ్‌సీల మరమ్మతులకు రూ.43.18 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కుషాయిగూడ, సూర్యాపేట జిల్లా అంబేడ్కర్ నగర్, సిద్దిపేటలోని అంబేడ్కర్ నగర్ పీహెచ్సీ వైద్యులతో, ఆసుç³త్రికి వచ్చిన హరిత, అన్నపూర్ణ అనే మహిళలతోనూ హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో అధికారులు శ్వేతామహంతి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రమేష్‌రెడ్డి, డాక్టర్ అజయ్‌కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గూగుల్ గ్లాస్‌తో మెరుగైన గ్రామీణ వైద్యం
వాషింగ్టన్: గూగుల్ గ్లాస్ సాయంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం ఇకపై మరింత సులభతరం అవుతాయంటున్నారు అమెరికాలోని మసాచూసెట్స్ పరిశోధకులు. ముఖ్యంగా రోగి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని వైద్యునికి క్షణాల్లో చేరవేయడానికి గూగుల్గ్లాస్ అత్యంత ప్రభావంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల విషప్రభావాలకు గురైన రోగులకు చికిత్స అందించడంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. రోగికి సంబంధించిన పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవడానికి వైద్యుడు ఇంతకాలం టెలీకాలర్లపై ఆధారపడేవారు. సంప్రదాయ పద్ధతుల్లో రోగి వైద్యపరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి పెద్ద కంప్యూటర్లు, ప్రత్యేక గదులు కావాల్సి వచ్చేవి. కానీ గూగుల్గ్లాస్కు రోగికి సంబంధించిన అన్ని రకాల వైద్యపరీక్షల డేటాను పంపడం ద్వారా అది వైద్యుడి కంటి ముందే ఆ వివరాలను ప్రదర్శిస్తుంది. దృశ్యం, శబ్ధం అందుబాటులో ఉండటంతో రోగి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుడికి క్షణాల్లో అవగాహన కలిగి తదనుగుణంగా సూచనలు ఇవ్వగలుగుతాడు. అందువల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని రోగులకు తక్షణ వైద్య సేవలు అందించడంలో గూగుల్గ్లాస్ భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.