గూగుల్ గ్లాస్‌తో మెరుగైన గ్రామీణ వైద్యం
వాషింగ్టన్: గూగుల్ గ్లాస్ సాయంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం ఇకపై మరింత సులభతరం అవుతాయంటున్నారు అమెరికాలోని మసాచూసెట్స్ పరిశోధకులు. ముఖ్యంగా రోగి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని వైద్యునికి క్షణాల్లో చేరవేయడానికి గూగుల్‌గ్లాస్ అత్యంత ప్రభావంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల విషప్రభావాలకు గురైన రోగులకు చికిత్స అందించడంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. రోగికి సంబంధించిన పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవడానికి వైద్యుడు ఇంతకాలం టెలీకాలర్లపై ఆధారపడేవారు.
సంప్రదాయ పద్ధతుల్లో రోగి వైద్యపరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి పెద్ద కంప్యూటర్లు, ప్రత్యేక గదులు కావాల్సి వచ్చేవి. కానీ గూగుల్‌గ్లాస్‌కు రోగికి సంబంధించిన అన్ని రకాల వైద్యపరీక్షల డేటాను పంపడం ద్వారా అది వైద్యుడి కంటి ముందే ఆ వివరాలను ప్రదర్శిస్తుంది. దృశ్యం, శబ్ధం అందుబాటులో ఉండటంతో రోగి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుడికి క్షణాల్లో అవగాహన కలిగి తదనుగుణంగా సూచనలు ఇవ్వగలుగుతాడు. అందువల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని రోగులకు తక్షణ వైద్య సేవలు అందించడంలో గూగుల్‌గ్లాస్ భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.