Google Glass
-
దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేక యాప్
న్యూయార్క్: కంటి చూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను వాడేటపుడు పెద్దగా కష్టపడకుండానే ఫోన్ స్క్రీన్‌ను చక్కగా ఉపయోగించేలా కొత్తరకం యాప్‌ను అభివృద్ధి చేశారు. భారత శాస్త్రవేత్త శ్రీనివాస్ పుండ్లిక్ నేతృత్వంలోని బృందం ఈ యాప్‌కు రూపకల్పన చేసింది. కంటిచూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేటపుడు ‘గూగుల్ గ్లాస్’ ఉపకరణాన్ని ధరిస్తే ఫోన్ స్క్రీన్ గూగుల్ గ్లాస్లో కనిపిస్తుంది. గూగుల్ గ్లాస్‌ను ధరించాక వీరి తల కదలికలకు అనుగుణంగా ఫోన్ స్క్రీన్‌ను జూమ్ చేసి చూపిస్తుంది. -
గూగుల్ గ్లాస్‌తో మెరుగైన గ్రామీణ వైద్యం
వాషింగ్టన్: గూగుల్ గ్లాస్ సాయంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం ఇకపై మరింత సులభతరం అవుతాయంటున్నారు అమెరికాలోని మసాచూసెట్స్ పరిశోధకులు. ముఖ్యంగా రోగి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని వైద్యునికి క్షణాల్లో చేరవేయడానికి గూగుల్గ్లాస్ అత్యంత ప్రభావంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల విషప్రభావాలకు గురైన రోగులకు చికిత్స అందించడంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. రోగికి సంబంధించిన పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవడానికి వైద్యుడు ఇంతకాలం టెలీకాలర్లపై ఆధారపడేవారు. సంప్రదాయ పద్ధతుల్లో రోగి వైద్యపరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి పెద్ద కంప్యూటర్లు, ప్రత్యేక గదులు కావాల్సి వచ్చేవి. కానీ గూగుల్గ్లాస్కు రోగికి సంబంధించిన అన్ని రకాల వైద్యపరీక్షల డేటాను పంపడం ద్వారా అది వైద్యుడి కంటి ముందే ఆ వివరాలను ప్రదర్శిస్తుంది. దృశ్యం, శబ్ధం అందుబాటులో ఉండటంతో రోగి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుడికి క్షణాల్లో అవగాహన కలిగి తదనుగుణంగా సూచనలు ఇవ్వగలుగుతాడు. అందువల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని రోగులకు తక్షణ వైద్య సేవలు అందించడంలో గూగుల్గ్లాస్ భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
గూగుల్ గ్లాస్.. ఇక భావోద్వేగాలనూ గుర్తిస్తుంది!
బెర్లిన్: కళ్లజోడు కంప్యూటర్ ‘గూగుల్ గ్లాస్’ ఇక ఎదురుగా ఉన్న మనుషుల వయసు, లింగం వంటివే కాదు.. మనుషుల భావోద్వేగాలనూ గుర్తిస్తుంది. ఇందుకు ఉపయోగపడే ‘షోర్’ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ను జర్మనీలోని ఫ్రాన్‌హోపర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పరిశోధకులు రూపొందించారు. ఈ షోర్ అప్లికేషన్ మనుషుల ముఖాలను, హావభావాలను విశ్లేషించి భావోద్వేగాలను అంచనా వేస్తుందట. గూగుల్ గ్లాస్లో ఉన్న గ్లాస్‌వేర్ ఆప్ ఎదురుగా ఉన్నవారు స్త్రీలా? పురుషులా? వారి వయసెంత? అన్నది గుర్తించగలిగినా.. వారి భావోద్వేగాలను పసిగట్టలేదని, కానీ తమ అప్లికేషన్‌తో అది సాధ్యం అవుతుందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. ఆటిజం వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి, అంధులకు, ఇతరులకు కూడా కమ్యూనికేషన్ కోసం ఈ ఆప్ బాగా ఉపయోగపడనుందట. మార్కెట్ సంబంధమైన విశ్లేషణలకూ ఈ ఆప్‌ను ఉపయోగించుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. -
ఆలోచిస్తే చాలు... ఫొటో తీసి ఫేస్బుక్లో పెడుతుంది!
కళ్లజోడుతో హ్యాండ్స్ ఫ్రీ కంప్యూటర్‌గా.. పేరుపొందిన గూగుల్ గ్లాస్‌కు మరో కొత్త హంగు వచ్చి చేరనుంది. గూగుల్ గ్లాస్‌ను పెట్టుకుని ఓ దృశ్యాన్ని చూస్తూ జస్ట్ ఆలోచిస్తే చాలు.. గూగుల్ గ్లాస్ ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించడంతో పాటు దానిని ఫేస్బుక్లో కూడా పోస్టు చేయనుంది. ఇందుకు ఉపయోగపడే ‘మైండ్ఆర్డీఆర్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను లండన్‌కు చెందిన ‘దిస్ ప్లేస్’ కంపెనీ అభివృద్ధిపర్చింది. సెన్సర్‌తో కూడిన చిన్న హెడ్‌సెట్‌తో ఈ యాప్ పనిచేస్తుంది. ఈ హెడ్సెట్ ధరించినవారి మెదడులో తరంగాలను విశ్లేషిస్తుంది. మనం గూగుల్ గ్లాస్ పెట్టుకుని ఏదైనా ఓ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు గ్లాస్ తెరపై కనిపించే దృశ్యంపై ఓ గీత ప్రత్యక్షమవుతుంది. ఆ గీతను అలాగే చూస్తూ ‘ఫొటో తీసుకోవాలి. ఫేస్బుక్లో పోస్టు చేయాలి’ అని అనుకుంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఫొటోను క్లిక్‌మనిపించి ఇది ఫేస్బుక్లో పోస్టు చేసేస్తుందని దిస్ ప్లేస్ క్రియేటివ్ డెరైక్టర్ క్లూ కిర్టన్ చెబుతున్నారు. శారీరక వికలాంగులు, ఇతర లోపాలు ఉన్నవారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే.. ఈ యాప్‌ను వాడేందుకు గూగుల్ గ్లాస్వారు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. -
దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’
న్యూయార్క్: ప్రపంచాన్ని మన ‘కళ్ల’ముందు ఉంచేలా సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న గూగుల్ గ్లాస్ మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది. దృష్టిలోపాలకు అనుగుణంగా, మనకు నచ్చే ఆకృతిలో కంటిఅద్ధాలను తయారు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంకా పరీక్ష దశలోనే ఉన్న గూగుల్ గ్లాస్ ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి విడుదలకానుంది. సరికొత్త హంగులతో, మనకునచ్చే రీతిలో లభించే వీటి ధర సుమారు రూ.14,000 ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.