గూగుల్ గ్లాస్.. ఇక భావోద్వేగాలనూ గుర్తిస్తుంది!
బెర్లిన్: కళ్లజోడు కంప్యూటర్ ‘గూగుల్ గ్లాస్’ ఇక ఎదురుగా ఉన్న మనుషుల వయసు, లింగం వంటివే కాదు.. మనుషుల భావోద్వేగాలనూ గుర్తిస్తుంది. ఇందుకు ఉపయోగపడే ‘షోర్’ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ను జర్మనీలోని ఫ్రాన్‌హోపర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పరిశోధకులు రూపొందించారు. ఈ షోర్ అప్లికేషన్ మనుషుల ముఖాలను, హావభావాలను విశ్లేషించి భావోద్వేగాలను అంచనా వేస్తుందట.
గూగుల్ గ్లాస్‌లో ఉన్న గ్లాస్‌వేర్ ఆప్ ఎదురుగా ఉన్నవారు స్త్రీలా? పురుషులా? వారి వయసెంత? అన్నది గుర్తించగలిగినా.. వారి భావోద్వేగాలను పసిగట్టలేదని, కానీ తమ అప్లికేషన్‌తో అది సాధ్యం అవుతుందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. ఆటిజం వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి, అంధులకు, ఇతరులకు కూడా కమ్యూనికేషన్ కోసం ఈ ఆప్ బాగా ఉపయోగపడనుందట. మార్కెట్ సంబంధమైన విశ్లేషణలకూ ఈ ఆప్‌ను ఉపయోగించుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు.