సార్.. ఇవీ సమస్యలు..
పెన్షనర్ల డేటా ఎంట్రీలోని సాంకేతిక సమస్యలపై సిబ్బంది మొర
సాక్షి, హైదరాబాద్: ‘సార్.. ఒక మండలంలోని పెన్షనరు పేరును కంప్యూటర్లో ఎంటర్ చేస్తే.. ఆ పేరు వేరే మండలానికి వెళ్తోంది. వృద్ధాప్య పింఛను వివరాలు నమోదు చేస్తే.. వికలాంగుల పింఛనుగా చూపిస్తోంది. సదరం సర్టిఫికేట్ ఆధారంగా ఎంటర్ చేసిన వైకల్య శాతం డేటాలో కని పించడం లేదు’ అంటూ పింఛన్ పంపిణీ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై సిబ్బంది ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నారు.
డేటా అప్లోడ్పై వివిధ జిల్లాల అధికారులతో గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్) సీఈవో మురళి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రెండ్రోజుల్లో టీసీఎస్, ఎన్ఐసీ నిపుణులను మండల కేంద్రాలకు పంపనున్నటు పేర్కొన్నారు. వయస్సు అంశం మినహా మిగిలిన వాటిల్లో మార్పులు, చేర్పులపై ఎంపీడీవోలకు వెసులుబాటు ఇస్తామన్నారు.