రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై స్పందించిన దలైలామా.. ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు దేశాలు సైతం రష్యాను కోరాయి. తాజాగా టిబెటియన్ ఆధ్యాత్యిక నేత దలైలామా.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు.
దలైలామా సోమవారం మాట్లాడుతూ.. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. కాగా, రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. అహింస మాత్రమే సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. అప్పుడే శాంతియుత ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని సూచించారు.
ఈ క్రమంలోనే.. మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలని కోరారు. అందరి మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే నిజమైన శాంతి ఏర్పడుతుందని పేర్కొన్నారు.