Russia Grand Prix Formula race
-
హామిల్టన్ హవా
సోచి: సహచరుడు బొటాస్ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్ వరకు వెటెల్ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్ జట్టు టీమ్ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది. -
హామిల్టన్ @ 9
మెర్సిడెస్ డ్రైవర్ ఖాతాలో రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ ఈ సీజన్లో తొమ్మిదో విజయం ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ పెరెజ్‌కు మూడో స్థానం సోచి (రష్యా): ఆద్యంతం నాటకీయంగా సాగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 11.024 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 42వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ ఏడు ల్యాప్‌ల తర్వాత కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వైదొలగగా... అతని వెనకాలే రెండో స్థానంలో ఉన్న హామిల్టన్ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి వెనుదిరిగి చూడని హామిల్టన్ చివరి ల్యాప్ వరకూ ఆధిక్యంలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 30 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ టాప్-3లో నిలువడం గమనార్హం. చివరి ల్యాప్‌లో పెరెజ్ ఐదో స్థానానికి పడిపోయే అవకాశం కనిపించింది. అయితే పెరెజ్‌ను ఓవర్టేక్ చేయబోయిన కిమీ రైకోనెన్, బొటాస్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పెరెజ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనై వైదొలిగారు. ఈ సీజన్లో 15 రేసులు పూర్తయ్యాక ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో హామిల్టన్ (302 పాయింట్లు), వెటెల్ (236 పాయింట్లు), రోస్‌బర్గ్ (229 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.