హామిల్టన్ @ 9
మెర్సిడెస్ డ్రైవర్ ఖాతాలో
రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్
ఈ సీజన్‌లో తొమ్మిదో విజయం
‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ పెరెజ్‌కు మూడో స్థానం
సోచి (రష్యా): ఆద్యంతం నాటకీయంగా సాగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 11.024 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 42వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ ఏడు ల్యాప్‌ల తర్వాత కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వైదొలగగా...
అతని వెనకాలే రెండో స్థానంలో ఉన్న హామిల్టన్ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి వెనుదిరిగి చూడని హామిల్టన్ చివరి ల్యాప్ వరకూ ఆధిక్యంలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 30 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ టాప్-3లో నిలువడం గమనార్హం. చివరి ల్యాప్‌లో పెరెజ్ ఐదో స్థానానికి పడిపోయే అవకాశం కనిపించింది.
అయితే పెరెజ్‌ను ఓవర్‌టేక్ చేయబోయిన కిమీ రైకోనెన్, బొటాస్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పెరెజ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనై వైదొలిగారు. ఈ సీజన్‌లో 15 రేసులు పూర్తయ్యాక ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో హామిల్టన్ (302 పాయింట్లు), వెటెల్ (236 పాయింట్లు), రోస్‌బర్గ్ (229 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.