Russia tennis
-
ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు
పారిస్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను శుక్రవారం ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్ పోటీల్లో(సెప్టెంబర్ 30) సిజికోవా.. తన అమెరికన్ పార్ట్నర్ మాడిసన్ బ్రెంగ్లీలో కలిసి ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఓడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సిజాకోవా జోడీ.. రొమేనియా జంట ఆండ్రియా మీటు, పాట్రిసియా మారియా చేతిలో 6-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్ అయిదో పాయింట్ వద్ద సిజికోవా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది అక్టోబర్‌లో విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిజికోవా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రష్యా భామ ఎకాటరీనా అలెక్సాండ్రోవాతో తొలిసారి జతకట్టిన సిజికోవా.. 1-6, 1-6తో ఆస్ట్రేలియా జోడీ స్టార్మ్ సాండర్స్, అజ్లా టామ్లజనోవిక్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 101 స్థానంలో కొనసాగుతున్న సిజికోవా.. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు పార్ట్నర్లను మార్చి వరుస పరాజయాలను మూటకట్టుకుంది. చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
ఆటలో నెం 7.. ధనార్జనలో నెం 1
మరియా షరపోవా.. ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రపంచంలో అత్యధిక సంపాదన గల మహిళా అథ్లెట్. అందానికి మారుపేరు. ఆటతీరు, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్యా టెన్నిస్ స్టార్.. డ్రగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ వార్త షరపోవాతో పాటు అభిమానులకు, క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు షాక్ కలిగించింది. డోపింగ్ పరీక్షల్లో షరపోవా పాజిటీవ్‌గా తేలడం టెన్నిస్ ప్రపంచంలో కలకలం సృష్టించింది. మెల్డోనియం డ్రగ్‌ను 2006 నుంచి తీసుకుంటున్నట్టు షరపోవా చెప్పింది. అయితే ఈ డ్రగ్‌ను ఈ ఏడాదే నిషేధించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం.. దీన్ని వాడాలని సూచించిన వైద్యుడికి తెలియదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు షరపోవా నిరాకరించింది. పూర్తి బాధ్యత తనదేని చెప్పింది. షరపోవా ఇటీవల గాయాలతో బాధపడుతోంది. దీని ప్రభావం ఆమె కెరీర్‌పైనా పడింది. 2001లో డబ్ల్యూటీఏ టూర్లో పాల్గొన్న షరపోవా తక్కువ కాలంలోనే ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఈ రష్యా బ్యూటీ ఆ మరుసటి ఏడాదే 2005లో 18 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014ల్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలిచింది. గత లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గింది. షరపోవా తన కెరీర్లో 4 ఐటీఎఫ్, 35 డబ్ల్యూటీఏ టైటిల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉంది. ఇక ధనార్జనలో షరపోవాదే అగ్రస్థానం. ఫ్రైజ్‌మనీతో పాటు ఎండార్స్మెంట్ల ద్వారా ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న క్రీడాకారిణి షరపోవానే. 2005 నుంచి వరుసగా 11 సంవత్సరాలు అగ్రస్థానంలో ఉండటం విశేషం. గతేడాది ఆమె సంపాదన దాదాపు 200 కోట్ల రూపాయలు. డోపీగా తేలడంతో షరపోవా కెరీర్ ప్రమాదంలో పడింది. అంతేగాక, ఎండార్స్మెంట్లను సంబంధింత కంపెనీలు రద్దు చేసుకునే అవకాశముంది. షరపోవా డోపీగా తేలిన విషయం తెలిసిన వెంటనే నైక్ రద్దు చేసుకుంది. -
చాలా పెద్ద తప్పు చేశా: షరపోవా
లాస్ ఏంజిలెస్: రష్యా టెన్నిస్ స్టార్, ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ మరియా షరపోవా పెను వివాదంలో చిక్కుకుంది. షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటీవ్‌గా తేలినట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. 2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పింది. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది. 'డోపింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా. దీనికి పూర్తిగా నాదే బాధ్యత. నేను చాలా పెద్ద తప్పు చేశా. అభిమానుల మనసును గాయపరిచా. నాలుగేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడుతున్నా. టెన్నిస్‌ను ఎంతో ప్రేమించా. డోపీగా తేలడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసు. ఈ విధంగా నా కెరీర్‌ను ముగించాలని కోరుకోవడం లేదు. టెన్నిస్ ఆడేందుకు మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా' అని ప్రపంచ మాజీ నెంబర్ వన్ షరపోవా లాస్ ఏంజిలెస్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. జనవరి 26న నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో షరపోవా ఫెయిల్ అయినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ నెల 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు వెల్లడించింది. షరపోవాపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముందని, అయితే శిక్షను తగ్గించే అవకాశం కూడా ఉందని ఆమె తరపు న్యాయవాది జాన్ హగెర్టీ చెప్పారు. రష్యా టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు షమిల్ టర్పిషెవ్ ఈ విషయంపై స్పందిస్తూ షరపోవా రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. డోపింగ్ పరీక్షల్లో షరపోవా పాజిటీవ్‌గా తేలడం పట్ల టెన్నిస్ సంఘాలు, క్రీడాకారులు విస్మయం చెందారు.