చాలా పెద్ద తప్పు చేశా: షరపోవా
లాస్ ఏంజిలెస్: రష్యా టెన్నిస్ స్టార్, ఐదు సార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్ మరియా షరపోవా పెను వివాదంలో చిక్కుకుంది. షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటీవ్గా తేలినట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. 2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పింది. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది.
'డోపింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా. దీనికి పూర్తిగా నాదే బాధ్యత. నేను చాలా పెద్ద తప్పు చేశా. అభిమానుల మనసును గాయపరిచా. నాలుగేళ్ల వయసు నుంచి టెన్నిస్ ఆడుతున్నా. టెన్నిస్ను ఎంతో ప్రేమించా. డోపీగా తేలడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసు. ఈ విధంగా నా కెరీర్ను ముగించాలని కోరుకోవడం లేదు. టెన్నిస్ ఆడేందుకు మరో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా' అని ప్రపంచ మాజీ నెంబర్ వన్ షరపోవా లాస్ ఏంజిలెస్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.
జనవరి 26న నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో షరపోవా ఫెయిల్ అయినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ నెల 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు వెల్లడించింది. షరపోవాపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముందని, అయితే శిక్షను తగ్గించే అవకాశం కూడా ఉందని ఆమె తరపు న్యాయవాది జాన్ హగెర్టీ చెప్పారు. రష్యా టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు షమిల్ టర్పిషెవ్ ఈ విషయంపై స్పందిస్తూ షరపోవా రియో ఒలింపిక్స్లో ఆడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. డోపింగ్ పరీక్షల్లో షరపోవా పాజిటీవ్గా తేలడం పట్ల టెన్నిస్ సంఘాలు, క్రీడాకారులు విస్మయం చెందారు.