అనుకోకుండా అగాధంలోకి... | Sharapova Loses Major Sponsors After Positive Drug Test | Sakshi
Sakshi News home page

అనుకోకుండా అగాధంలోకి...

Published Wed, Mar 9 2016 12:22 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

అనుకోకుండా అగాధంలోకి... - Sakshi

అనుకోకుండా అగాధంలోకి...

నిప్పులు చిమ్ముతు నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరే... నెత్తురు కక్కుతు నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే... ఎప్పుడో మన శ్రీ శ్రీ రాసిన ఈ మాట ఇప్పుడు టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు అతికినట్టు సరిపోతుంది. టెన్నిస్ చరిత్రలో అత్యంత ‘ఖరీదైన’ క్రీడాకారిణిగా ఆకాశానికెత్తిన సమాజం... ఇప్పుడు డోపింగ్‌లో విఫలం కావడంతో విమర్శల వర్షం కురిపిస్తోంది. తెలిసి చేసినా, పొరపాటున చేసినా షరపోవా చాలా ఖరీదైన తప్పు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిన్నప్పుడు అమెరికా వెళ్లిన ఓ అమ్మాయి...

1200 కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలోనే ఎక్కువ సంపాదన ఉన్న క్రీడాకారిణిగా ఎదిగింది. ఇన్నాళ్లూ ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. కానీ డోపింగ్ వివాదంతో ఆ పేరు పోగొట్టుకుంది.

 
సాక్షి క్రీడావిభాగం: సాధారణంగా ఆట, అందం ఒకే చోట ఉండటం అరుదు. కానీ షరపోవాలో ఈ రెండూ ఉన్నాయి. అందుకే ఆమె కోట్లాది మంది టెన్నిస్ అభిమానులకు ఆరాధ్య దేవత. ఆట విషయంలో, మార్కెటింగ్ విషయంలోనూ ఆమె చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఏ రోజూ ట్రైనింగ్ షెడ్యూల్‌ను తప్పదు. డైట్ దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక తనని తాను మార్కెట్ చేసుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తుంది.

అందుకే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లు ఆమె కోసం క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక చిన్న నిర్లక్ష్యానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. ఒక ఈ-మెయిల్‌ను తెరచి జాగ్రత్తగా చదవకపోవడం వల్ల ఇంత అనర్థం జరిగింది. తన కెరీర్‌నే అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
నాన్న సంకల్పం
టెన్నిస్‌లో షరపోవా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో తండ్రి యూరీ పాత్ర ఎనలేనిది. 1987లో ఏప్రిల్ 19న రష్యాలోని న్యాగన్ పట్టణంలో యూరీ, యెలానా దంపతులకు షరపోవా జన్మించింది. అంతకుముందు ఏడాది చెర్నోబిల్ అణు కర్మాగారంలో సంభవించిన విస్ఫోటం వల్ల ఆ ప్రభావం తమ ఆరోగ్యంపై పడకూడదనే ఉద్దేశంతో షరపోవా కుటుంబం 1989లో సోచి పట్టణానికి మకాం మార్చింది. అక్కడే టెన్నిస్ కోచ్ అలెగ్జాండర్ కఫెల్నికోవ్‌తో యూరీకి పరిచయం ఏర్పడింది. 1991లో షరపోవాకు అలెగ్జాండర్ కఫెల్నికోవ్ ఒక రాకెట్ ఇచ్చారు.

ఈ రాకెట్‌తో షరపోవా తన తండ్రితో కలిసి స్థానిక పార్క్‌లో టెన్నిస్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత తన కూతురిని మేటి టెన్నిస్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తండ్రి యూరీ వెటరన్ కోచ్ యూరీ యుట్‌కిన్ వద్ద శిక్షణ ఇప్పించారు. 1993లో మాస్కోలో దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నిర్వహించిన టెన్నిస్ క్లినిక్‌కు షరపోవా హాజరైంది. అక్కడే ఆరేళ్ల షరపోవా ఆటతీరును గమనించిన నవ్రతిలోవా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న విఖ్యాత నిక్ బొలెటరీ టెన్నిస్ అకాడమీలో చేర్పించాలని తండ్రి యూరీకి సూచించింది.
 
తల్లికి దూరంగా...
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంగ్లిష్ భాష తెలియనప్పటికీ... తన కూతురు భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో యూరీ అప్పు చేశాడు. 1994లో చేతిలో 700 డాలర్లు పెట్టుకొని యూరీ, షరపోవా అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అడుగుపెట్టారు. వీసా సమస్యల కారణంగా షరపోవా వెంట ఆమె తల్లి రాలేకపోయింది. రెండేళ్లు తల్లికి దూరంగానే షరపోవా ఉండాల్సి వచ్చింది. మరోవైపు తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో యూరీ చిన్నా చితకా పనులు చేసి సంపాదించారు. చివరికి హోటళ్లలో ప్లేట్‌లు కూడా కడిగారు.

కొంతకాలం స్థానిక రిక్ మాకీ అకాడమీలో శిక్షణ పొందిన షరపోవా కెరీర్ 1995లో మలుపు తిరిగింది. ఆమె ప్రతిభను గమనించిన ఐఎంజీ సంస్థ షరపోవాతో 1995లో ఒప్పందం చేసుకుంది. నిక్ బొలెటరీ అకాడమీలో ఉండి శిక్షణ పొందేందుకు ఏడాదికి అవసరమయ్యే 35 వేల డాలర్ల ఫీజును చెల్లించడానికి ఐఎంజీ సంస్థ అంగీకరించింది. దాంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో షరపోవా నిక్ బొలెటరీ అకాడమీలో చేరింది. అక్కడి నుంచి షరపోవాకు ఎదురులేకుండా పోయింది.

2000లో 13 ఏళ్ల ప్రాయంలో ఎడ్డీ హెర్ అంతర్జాతీయ టోర్నీలో షరపోవా అండర్-16 విభాగంలో టైటిల్ సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తన ఆటకు మరింత పదును పెట్టుకొని 14 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారింది. 2003 చివరికొచ్చేసరికి టాప్-50లోకి వచ్చింది.
 
టెన్నిస్‌లో రష్యా విప్లవం
ఒక్కో మెట్టు ఎక్కిన షరపోవా 2004లో మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ఏడాది వింబుల్డన్ ఫైనల్లో షరపోవా వరుస సెట్‌లలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. వింబుల్డన్ టైటిల్ గెలిచినందుకు వచ్చిన ప్రైజ్‌మనీతో షరపోవా తన తండ్రి పేరిట ఉన్న అప్పులను తీర్చేసింది. 2005 ఆగస్టులో ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగిన షరపోవా ఈ ఘనత సాధించిన తొలి రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2006లో ఆమె యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

షరపోవా విజయాల స్ఫూర్తితో రష్యాలో టెన్నిస్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు టెన్నిస్ క్రీడను కెరీర్‌గా ఎంచుకోవడం మొదలుపెట్టారు. 2007లో భుజం గాయంతో షరపోవా కొంతకాలంపాటు ఆటకు దూరమైంది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి ఫామ్‌లోకి వచ్చిన ఈ రష్యా స్టార్‌కు భుజం గాయం తిరగబెట్టింది. దాంతో పది నెలలపాటు ఆటకు దూరమైంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకున్న షరపోవా లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించింది.

2013లో అంతగా ఆకట్టుకోలేకపోయినా... 2014లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. 2015లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా... సెరెనా ధాటికి రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరిన షరపోవా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరమైంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న షరపోవా ఈ టోర్నీ సందర్భంగా డోప్ టెస్టులో పట్టుబడింది. ఏం జరిగినా... ఇకపై మహిళల టెన్నిస్‌కు కొంత కళ తగ్గుతుందనేది వాస్తవం. షరపోవా కోసమే టెన్నిస్ చూసే అభిమానులు లక్షల్లో ఉంటారు. వాళ్లందరికీ నిరాశ తప్పదు. అయితే నాలుగేళ్ల తర్వాతైనా తిరిగి మళ్లీ వచ్చి కొంతకాల ఆడి సగర్వంగా వైదొలగాలనే షరపోవా ఆశ తీరాలనేది ఆమె అభిమానుల ఆకాంక్ష.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement