హతవిధీ! | Sharapova showed 'courage' over failed drugs test | Sakshi
Sakshi News home page

హతవిధీ!

Published Wed, Mar 9 2016 12:07 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

హతవిధీ! - Sakshi

హతవిధీ!

ఓ చిన్న తప్పు... టెన్నిస్ క్రీడకు మచ్చ తెచ్చింది.  ఓ చిన్న నిర్లక్ష్యం... గొప్ప క్రీడాకారిణి కెరీర్‌కు కళంకం తెచ్చింది. తెలిసి చేసిందో... తెలియక చేసిందోగానీ.. చేసిన చిన్న తప్పిదానికి రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా భారీ మూల్యం చెల్లించింది. ఎండకు ఎండి... చెమటకు తడిచి నిర్మించుకున్న 15 ఏళ్ల ఉజ్వల కెరీర్‌కు ఊహించని రీతిలో బ్రేక్ పడింది! ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో షరపోవా విఫలమైంది. నిషేధిత ఉత్ప్రేరకం వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. షరపోవా డోప్ టెస్టులో విఫలమైన వార్తతో టెన్నిస్ ప్రపంచం ఉలిక్కి పడింది.
 
* డోపింగ్ టెస్టులో విఫలమైన షరపోవా
* మెల్డోనియం వాడినట్లు నిర్ధారణ
* నాలుగేళ్లు  నిషేధం పడే అవకాశం


లాస్ ఏంజిల్స్ (అమెరికా): రష్యా టెన్నిస్ స్టార్, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత మరియా షరపోవా డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ను వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో షరపోవాపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. ఇది ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 26న నిర్వహించిన డోప్ పరీక్షలో షరపోవా మెల్డోనియం వాడినట్లు తేలడంతో మార్చి 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు.

సోమవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్యా క్రీడాకారిణి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కేసు విచారణలో ఉండటంతో నిషేధం, జరిమానా ఎంత విధిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం అథ్లెట్లు ఉద్దేశపూర్వకంగా ఈ మందును తీసుకున్నారని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం, తెలియక జరిగిన తప్పుగా భావిస్తే రెండేళ్ల నిషేధం, స్వల్ప జరిమానా విధించే అవకాశాలున్నాయి.
 
అసలు కథ ఇది!
వాస్తవానికి షరపోవా 2006 నుంచే మెల్డోనియంను వాడుతోంది. కానీ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ డ్రగ్‌ను ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని అథ్లెట్లందరికీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ మెయిల్‌ను చదివిన షరపోవా కాస్త నిర్లక్ష్యపు ధోరణితో నిషేధిత డ్రగ్స్ జాబితాకు సంబంధించిన లింక్‌ను మాత్రం తెరచి చూడలేదు. దీంతో యధావిధిగా మెల్డోనియం ఉపయోగించడంతో డోపింగ్‌లో పట్టుబడింది.
 
రక్త ప్రసరణ పెంచుతుంది
తాను తరచుగా ఫ్లూ బారిన పడుతుండటం, కుటుంబంలో చాలా మందికి షుగర్ వ్యాధి ఉండటం, శరీరంలో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉండటం, గుండె సంబంధిత సమస్యల వంటి అనేక అంశాలతో గత పదేళ్ల నుంచి మెల్డ్రోనేట్ (మెల్డోనియం)ను వాడుతున్నట్లు షరపోవా తెలిపింది. అయితే మెల్డ్రోనేట్, మెల్డోనియం ఒకే రకమైన డ్రగ్ అనే విషయం తనకు తెలియదని చెప్పింది. మరోవైపు ఐషిమియా (శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం) వ్యాధిగ్రస్తుల్లో రక్త ప్రసరణ పెంచడానికి మెల్డోనియంను ఉపయోగిస్తారు.

దీనివల్ల ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం పెరుగుతుంది. మెల్డోనియం తీసుకోవడం వల్ల అథ్లెట్లలో ఎక్స్‌ర్‌సైజ్ చేసే సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు మైదానంలో మెరుగైన ప్రదర్శనకు కారణం అవుతుందని వివిధ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్న ‘వాడా’ ఎస్-4 నిషేధిత జాబితాలో చేర్చింది. లాత్వియా దేశంలో తయారయ్యే ఈ మందును రష్యా, బాల్టిక్ దేశాల్లో మాత్రమే అమ్ముతారు. అమెరికా ఎఫ్‌డీఏతో పాటు యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీనికి ఆమోదం లేదు.
 
మరికొంత మంది కూడా...
ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ మందును వాడిన మరికొంత మంది అథ్లెట్లు కూడా డోప్ పరీక్షలో విఫలమయ్యారు. అబెబీ అర్గెవీ (మహిళల 1500 మీటర్లు), ఎండేషా నెగేస్సి (మారథాన్), ఓల్గా అబ్రామోవా, అర్టెమ్ టైచెంకో (ఉక్రెయిన్ బైఅథ్లెట్స్), ఎడ్వర్డ్ ఓర్గనోవ్ (రష్యా సైక్లిస్ట్), ఎకతెరినా (రష్యా ఐస్ డాన్సర్)లు డోపీలుగా తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు.
 
నైకీ బై బై
డోపింగ్ ఉదంతం బయటకు రావడంతో వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు కుమ్మరించే స్పా న్సర్లు ఒక్కొక్కరుగా తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రముఖ క్రీడావస్త్రాల సంస్థ ‘నై కీ’... షరపోవాతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుం ది. స్విస్ వాచ్ కంపెనీ ‘టాగ్ హ్యుయేర్’ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి నిరాకరించింది. ‘నేను డోప్ పరీక్షలో విఫలమయ్యా. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. చాలా పెద్ద తప్పు చేశా. నా అభిమానులకు, టెన్నిస్‌కు తలవంపులు తీసుకొచ్చా. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టా. అప్పట్నించీ ఆటలోనే మునిగితేలా. ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలుసు. నా కెరీర్‌ను ఇలా ముగించాలని అనుకోవడంలేదు. టెన్నిస్ ఆడేందుకు నాకు ఇంకో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.’    - షరపోవా
 
ప్రొఫైల్
పూర్తి పేరు: మరియా షరపోవా
పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1987
పుట్టిన స్థలం: న్యాగన్, రష్యా
నివాసం: ఫ్లోరిడా, అమెరికా
ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు
బరువు: 59 కేజీలు
ప్రొఫెషనల్‌గా మారింది: 2001లో
అత్యుత్తమ ర్యాంక్: 1 (2005, ఆగస్టు)
ప్రస్తుత ర్యాంక్: 7
కెరీర్ సింగిల్స్ టైటిల్స్: 35
కెరీర్ డబుల్స్ టైటిల్స్: 3
గ్రాండ్‌స్లామ్ టైటిల్స్: వింబుల్డన్ (2004), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008), ఫ్రెంచ్ ఓపెన్ (2012, 2014), యూఎస్ ఓపెన్ (2006)
గెలుపోటములు: 601-145
సంపాదించిన ప్రైజ్‌మనీ: 3,67,66,149 డాలర్లు (రూ. 247 కోట్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement