Russian spy
-
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
‘మీ కొడుకులను చంపేస్తాం’
రక్కా (సిరియా): ‘మీకు శాంతి లేకుండా చేస్తాం. మీ కొడుకులను చంపేస్తాం. మీ ఇళ్లను పేల్చేస్తాం. ఇక్కడ మీ సైనికుల దాడుల్లో చనిపోయిన ప్రతి కుమారుడికి, ధ్వంసమైన ప్రతి ఇంటికీ బదులు తీర్చుకుంటాం’ అని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు తాజాగా విడుదల చేసిన వీడియోలో రష్యా ప్రజలు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి హెచ్చరిక జారీ చేశారు. ఎనిమిది నిమిషాల నిడివిగల ఈ వీడియోను ఐఎస్ఐఎస్ మీడియా ఛానెల్ ద్వారా విడుదల చేశారు. పైశాచికానందానికి పరాకాష్టగా గతంలో బ్రిటన్ సైనికులను మెడ నరాలను తెగ్గోసి దారుణంగా జీహాదీలు హత్య చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడూ అదే తరహాలో రష్యా గూఢచారిగా అనుమానిస్తున్న ఓ యువకుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి, వెనక నుంచి జుట్టు పట్టుకొని అతని మెడను కత్తితో చిట్లిస్తున్న దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం ఎనిమిది నిమిషాల వీడియోలో మొదటి ఆరు నిమిషాలు ఓ రష్యా యువకుడు తాను రష్యా గూఢచారిగా పనిచేస్తున్న విషయాన్ని ఒప్పుకోవడమే ఉంది. ఐఎస్ఐఎస్ జిహాదీల సమాచారాన్ని సేకరించేందుకు తాను పనిచేస్తున్నానని ఆయన అందులో చెప్పారు. అనంతరం ఓ రష్యన్ జిహాదీ రష్యన్ ప్రజలను హెచ్చరించడం ఉంది. ఇద్దరూ కూడా రష్యా భాషలోనే మాట్లాడారు. ఈ సంఘటనను అటు రష్యా పార్లమెంట్‌గానీ, ప్రభుత్వంగానీ, చివరకు విదేశాంగ శాఖగానీ ధ్రువీకరించలేదు. రష్యా ఇంటలెజెన్స్ తరఫున పనిచేస్తున్న ఇరువురు రష్యన్లను ఓ బాల టెర్రరిస్టు నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్న వీడియోను గతంలో ఐఎస్ఐఎస్ టైర్రరిస్టులు విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈజిప్టులోని షారమ్ ఎల్ షేక్ రిసార్ట్‌లో రష్యా విమానాన్ని టెర్రరిస్టులు గత సెప్టెంబర్‌లో కూల్చి వేసినప్పటి నుంచి ఐఎస్ఐఎస్ టైర్రరిస్టులపై రష్యా సైనికులు దాడులు తీవ్రతరం చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ను, రష్యా ప్రజలను టైర్రరిస్టులు హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది.