
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు.
ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్‌మెంట్ సెయింట్ పీటర్స్‌బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు.
– హెల్సింకీ
Comments
Please login to add a commentAdd a comment