రష్యా వెయిట్‌లిఫ్టింగ్ జట్టుపై నిషేధం
పారిస్ : రష్యా క్రీడారంగానికి మరో గట్టి షాక్ తగిలింది. పటిష్ట వెయిట్‌లిఫ్టింగ్ జట్లలో ఒకటిగా నిలిచే రష్యా జట్టును రియో ఒలింపిక్స్ క్రీడల నుంచి నిషేధించారు. డోపింగ్ కారణంగానే ఎనిమిది మందితో కూడిన ఈ బృందంపై వేటు నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) ప్రకటించింది. రష్యన్ల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్ క్రీడకున్న పేరుప్రతిష్టలు చాలాసార్లు దెబ్బతిన్నాయని, అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామని ఐడబ్ల్యుఎఫ్ పేర్కొంది. 2008, 2012 ఒలింపిక్స్ సందర్భంగా సేకరించిన వీరి శాంపిళ్ల ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని గుర్తు చేసింది. రష్యా ఒలింపిక్ కమిటీ నామినేట్ చేసిన అథ్లెట్ల జాబితా నుంచి ఇప్పటికే డోపింగ్ కారణంగా 117 మంది అథ్లెట్లను నిషేధించారు. రష్యా జట్టులో అర్టెమ్ ఒకులోవ్ గతేడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.